విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామూహిక ఎలుకల నివారణను చేపట్టి పంటలను కాపాడుకోవాలని కలెక్టర్ యస్ డిల్లీ రావు రైతులకు విజ్ఞప్తి చేశారు. సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం పై రైతులకు అవగాహన కల్పించే పోస్టర్లను సోమవారం నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డిల్లీ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
సార్వా వరి పైరులో ఎలుకల వలన రైతులు విత్తనం వేసిన దగ్గర నుండి కోతకోసే వరకు నష్ట పోతూన్నారని, ఈ ఎలుకల వలన కలిగే నష్టాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం , వ్యవసాయ శాఖ ద్వారా ” సామూహిక ఎలుకల నివారణ ” కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరి పండించే రైతులకు బ్రోమోడయోలిన్ అనే మందును నూరు శాతం రాయితీ పై ఉచితంగా అందిస్తోందన్నారు జిల్లా వ్యాప్తంగా సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. బ్రోమోడయోలిన్ మందును ఆయా రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో వుంచడం జరిగిందన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రము నందు , ఆ గ్రామములో ఉన్న విస్తీర్ణానికి సరిపడిన విషపు ఎరను తయారు చేసి రైతులకు అందచేయటం జరుగుతుందన్నారు . విషపు ఎరకు కావలసిన బియ్యపు నూక , నూనె గ్రామ పంచాయితీ వారి సహకారంతో సేకరించి గ్రామ సర్పంచి , ఇతర ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సామూహికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.దీని ద్వారా జిల్లాలోని మంది వరి పండించే రైతులకు లాభం చేకూరుతుందన్నారు . ఇందుమూలంగా మండలాల రైతాంగం , గ్రామ సర్పంచులు , ప్రజా ప్రతినిధులు ” సామూహిక ఎలుకల నివారణ ” కార్యక్రమములో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ ఢిల్లీ రావు కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్, డిఆర్ఓ కే మోహన్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం. విజయ భారతి. డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జె సునీత ఉన్నారు.
Prajavartha Online Telugu News