విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నివృత్తులలో ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందని విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
గురుపూజోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం నగరంలోని బృందావన కాలనీ ఏ కన్వెన్షన్ హాల్లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తొలుత కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, డిఆర్వో కె మోహన్‌కుమార్‌లు భారత మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వే పల్లి రాధాకృష్ణ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు మాట్లాడుతూ భారత రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యారంగానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఆ మహనీయుని త్యాగాలను ప్రతి ఉపాధ్యాయుడు గుర్తించుకోవాలన్నారు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ తత్వశాస్త్రంలో గొప్ప ప్రావీణ్యులు అని అన్నారు. ఉపాధ్యాయు వృత్తి అన్ని వృత్తుల్లో గౌరవప్రదమైందని సమాజంలో మంచి గుర్తింపు గౌరవం ఉపాధ్యాయినికి ఉంటాయన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఆకట్టుకునేలా విద్యాబోధన చేయాలన్నారు. తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయుల ప్రభావమే పిల్లలపై ఎక్కువగా ఉంటుందన్నారు. భాష పైన సబ్జెక్టులపైన పట్టు ఉండాలన్నారు. బోధనలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతీ ఉపాధ్యాయుడు కొత్తదనాన్ని అలవర్చుకోవాలని బోధనలో నాణ్యత
ఉండాలని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు రోల్ మోడల్‌గా ఉండాలని విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అత్యాధునిక మౌలిక వసతులను కోట్లాది రూపాయలతో ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఉపాధ్యాయులకు పాఠశాలల తరగతి గదులలో అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. ఉపాధ్యాయులు కూడా తమ వృత్తి పట్ల నిబద్దత అంకితభావంతో విద్యార్థులకు బోధించి జిల్లాను విద్యారంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ డిల్లీరావు ఉపాధ్యాయులను కోరారు.
ఈ కార్యక్రమంలో 24 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, డిఆర్వో కె. మోహన్‌కుమార్, డిఈవో సివి రేణుక డిప్యూటి డిఈవోలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
Prajavartha Online Telugu News