-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
నందిగామ నియోకవర్గ ప్రజలకు రక్షిత త్రాగు నీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన పథకాల పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు.
నందిగామ నియోకవర్గంలో చేపట్టిన త్రాగు నీటి పథకాల పనుల ప్రగతిపై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్ డిల్లీరావు, నందిగామ నియోకవర్గ శాసనసభ్యులు డా.మొండితోక జగన్మోహన్రావుతో కలిసి ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో తొలుత శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ పథకంలో 25.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 195 రక్షిత త్రాగు నీటి పథకం పనులు మంజూరయ్యేయని వీటిలో కొన్ని పనులు పూర్తి చేయడం జరిగిందని మరి కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయని ఇంకనూ పనుల ప్రారంభించాల్సిన పథకాలు ఉన్నాయని వీటిపై సమీక్షించి పథకాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పార్టీలకు అతీతంగా పనులను పూర్తి చేసి ప్రతి కుటుంబానికి రక్షిత త్రాగు నీటిని సరఫరా చేయాలన్నదే తన ప్రధాన ధ్యేయమన్నారు. ఇప్పటి వరకు జగనన్న కాలనీలలో పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇటీవల చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం పర్యటనలో ప్రజలు త్రాగు నీటి సరఫరా చేయాలని తన దృష్టికి తీసుకువచ్చారని పనులను పూర్తి చేసి త్రాగు నీటి సరఫరా చేయవలసిన బాధ్యత ఉందన్నారు.
రక్షిత త్రాగు నీటి పథకాల పై జిల్లా కలెక్టర్ డిల్లీరావు సమీక్షిస్తూ నందిగామ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఐదు లక్షల రూపాయల లోపు చేపట్టిన 91 పనులలో 28 పనులను పూర్తి చేయడం జరిగిందని 29 పనులు పురోగతిలో ఉన్నాయని 34 పనులను ప్రారంభించవలసి ఉందన్నారు. వీటిలో పరిటాల మున్నలూరు జి మాదవరం జుజ్జూరు పొన్నవరం వి.అన్నవరం వెల్లంకి తదితర గ్రామాలలో కంట్రాక్టర్లకు పనులను అప్పగించడం జరిగిందని త్వరలో పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరో 11 గ్రామాలకు సంబంధించి పనులను అప్పగించేలా వారం రోజుల లోపు పంచాయతీ తీర్మాణాలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 5 నుండి 40 లక్షల రూపాయల లోపు పనులకు సంబంధించి 95 పనులకు గాను 16 పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు అప్పగించడం జరిగిందని వీటిలో 3 పనులు పూర్తి చేయడం జరిగిందని లక్ష్మీపురం కొడవటికల్లు కొత్తూరు మునగాలపల్లి లింగాలపాడు పల్లగిరి పెద్దవరం తక్కెళపాడు తదితర గ్రామాలలో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. చేపట్టవలసిన 55 పనులను ప్యాకెజ్ పద్దతిన వారం రోజుల లోపు టెండర్లను పిలిచేందుకు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. 40 లక్షలకు పైబడిన 16 పనులకు మూడు సార్లు టెండర్లను పిలవడం జరిగిందని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని మరో సారి టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్యాకెజి కింద మరో 55 పనులకు గాను టెండర్లను ఖరారు చేసి పనులను అప్పగించడం జరిగిందన్నారు. సంబంధిత కాంట్రాక్టర్ వారం రోజులలో పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాల కోసం నీటిని సరఫరా చేసేందుకు తాత్కాలిక ఏర్పాట్ల ప్రాతిపదికన చేపట్టిన పనులలో 123 పనులు పూర్తి చేయడం జరిగిందని మరో 5 కాలనీలలో పనులు పూర్తి చేయవలసి ఉందని ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్డిల్లీరావు గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఇ డివి రమణ, ఇఇ డిఆర్ఎల్ ప్రసాద్, డిఇఇ రవికుమార్, ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News