విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రాష్ట్రంలో మహిళా సంక్షేమం, సాధికారతకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్ర తాంబూలం ఇస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం గవర్నర్ పేటలో జరిగిన కుట్టుమిషన్ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మహిళలనుద్దేశించి ప్రసంగించారు. మహిళలందరూ సగర్వంగా సొంత కాళ్లపై నిలబడేలా ప్రభుత్వం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. 90 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా 70 శాతం హాజరు కలిగిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ లను అందజేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టిన తొలి ప్రాధాన్యత మహిళలకేనని మల్లాది విష్ణు పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ప్రతి సంక్షేమ పథకాన్ని ఆడపడుచులకు మేలు జరిగేలా రూపకల్పన చేశారన్నారు. మహిళలు బాగుంటేనే ఇల్లు, సమాజం, రాష్ట్రం బాగుంటుందని నమ్మి.. అమ్మఒడి, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో వేల కోట్ల రూపాయలను నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పరిపాలనలోనూ మహిళలను భాగస్వామ్యం చేస్తూ.. కేబినెట్ సహా ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించారన్నారు. మరోవైపు టైలర్ల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. చేదోడు పథకం ద్వారా దర్జీలను ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు వివరించారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 1,692 మంది టైలర్స్ సోదరసోదరీమణులకు ఏటా రూ. 10 వేలు అందించడం జరుగుతోందన్నారు. అలాగే మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో నియోజకవర్గంలో ఇప్పటివరకు 70 వేల మంది ఆడబిడ్డలకు దాదాపు రూ. 200 కోట్ల సంక్షేమాన్ని వివిధ పథకాల రూపంలో అందించడం జరిగిందన్నారు. ఈ నిధులను సద్వినియోగ పరచుకుని మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీఓయూసిడి శకుంతల, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News