-సమయపాలన పాటించండి…ఆకస్మిక తనిఖీలు చేస్తా…
-పనులు పూర్తి చేయండంలో అశ్రద్దవహిస్తే చర్యలు తప్పవు…
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
గృహ నిర్మాణాలపై అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో వెనుకాడనని నా సహనాన్ని పరీక్షించవద్దని అప్పగించిన పనులను గడువులోపు పూర్తి చేయాలని ఇందులో ఎటువంటి మినహాయింపు లేదని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను హెచ్చరించారు.
నగరంలోని కలక్టరేట్ నుండి గృహ నిర్మాణాల ప్రగతిపై బుధవారం కలెక్టర్ డిల్లీరావు ఎంపీడీవోలు తహశీల్థార్లు, మున్సిపల్ కమిషనర్లు, గృహ నిర్మాణశాఖ ఏఈలు, మండల స్పెషల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో గృహా నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని నిర్థేశించిన లక్ష్యాలను పూర్తి చేయాల్సిన భాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. ప్రతి వారం సమావేశాలు నిర్వహించి గృహ నిర్మాణాల ప్రగతిపై లక్ష్యాలను నిర్థేశిస్తున్నామన్నారు. నిర్మాణాలకు అవసరమైన సామాగ్రిని సమకూరుస్తున్నప్పటికి లక్ష్యాలను సాధించలేకపోవడం సహించరానిదాన్నారు. నా ఆలోచనలకు ఆనుగుణంగా మీకు అప్పగించిన భాధ్యతలను నిర్వర్తించి లక్ష్యాలను సాధిస్తారని స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించానన్నారు. లక్ష్యాలను సాధించడంలో అలసత్వాన్ని వహించి నా సహనాన్ని పరీక్షించవద్దు ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాను. సమయపాలన పాటించని వారిని లక్ష్యాలను సాధించని వారిని ఉపేక్షించనని ఇది తుది హెచ్చరికగా భావించి గృహ నిర్మాణాలను పూర్తి చేయడంలో శ్రద్ద చూపాలని కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను హెచ్చరించారు. డిసెంబర్ మాసాంతరానికి 15 వేల గృహ నిర్మాణాలను పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. బిలో బేస్మింట్ లెవల్, బేస్మింట్ లెవల్, రూఫ్ లెవల్, రూఫ్ కాస్టింగ్ లెవల్‌కు తీసుకువచ్చి నిర్మాణాలను పూర్తి చేసేందుకు లక్ష్యాలను నిర్థేశించుకోని అమలు చేయాలన్నారు. వారం వారిగా నిర్థేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కొండపల్లి, తిరువూరు నందిగామ జగ్గయ్యపేట మున్సిపాలిటిలలో బేస్మింట్ లెవల్, రూఫ్ లెవల్, రూఫ్ కాస్టింగ్ లెవల్‌లో ఉన్న సుమారు 5వేల గృహాలను పూర్తి చేయాలన్నారు. ఇందులో సుమారుగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3,000 గృహాలను కొండపల్లి మున్సిపాలిటి పరిధిలో సుమారు 1300 గృహాలను తిరువూరు మున్సిపాలిటి పరిధిలో 160 గృహాలను నందిగామ మున్సిపాలిటి పరిధిలో 220 గృహాలను జగ్గయ్యపేట మున్సిపాలిటి పరిధిలో 2,000 గృహాలను పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 11 మండలాలకు సంబంధించి బేస్మింట్ లెవల్, రూఫ్ లెవల్, రూఫ్ కాస్టింగ్ లెవల్‌లో ఉన్న 10 వేల గృహాలను పూర్తి చేయలన్నారు. ఇందులో మైలవరం మండలంలో 1700 జి. కొండూరు మండలంలో 1100, కంచికచర్లల మండలంలో 900, నందిగామలో 800, చందర్లపాడు మండలంలో 720, పెనుగంచిప్రోలు మండలంలో 550, వత్సవాయి మండలంలో 600, వీరులపాడు మండలంలో 500, జగ్గయ్యపేట మండలంలో 250 విజయవాడ రూరల్ మండలంలో 2,000 గృహాలను 15 వారాలలో పూర్తి చేయాలన్నారు. వారం వారిగా నిర్థేశించుకున్న లక్ష్యాన్ని సాధించడంలో లోటు ఉన్నట్లయితే తదుపరి వారంలో లక్ష్యంతో కలిపి తప్పనిసరిగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్యాల సాధించడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు లబ్దిదారులు మేదోమదనం చేసుకుని పనులను పూర్తి చేయాలన్నారు. లేఅవుట్‌లలో ఎదురయ్యే సమస్యలను చెక్‌లిస్ట్ చేసుకుని పరిష్కార మార్గలను అన్వేషించుకుని పనులను పూర్తి చేయాలన్నారు. వారం వారిగా నిర్థేశించిన లక్ష్యాలను సాధించడంలో అలసత్యం వహిస్తే ఉపేక్షించబోనన్నారు. నిర్థేశించిన లక్ష్యాన్ని సవాల్‌గా తీసుకుని పనులు పూర్తి చేయడంలో పోటీ తత్వాన్ని కనపర్చాలని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, హౌసింగ్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వి శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికాంత్, విజయబాబు,ఖాజావలి, రాంప్రసాద్, మల్లేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్లు, యంపిడివోలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News