విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేతులమీదుగా ది.05-09-2022 న “రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” అందుకున్న మైనం హుస్సేన్ ది.22-09-2022 న గురువారం విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది. ఈ సందర్భంగా కమీషనర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేశారు. మైనం హుస్సేన్ గత 22 సంవత్సరాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో SPSMC ఉన్నత పాఠశాల, విజయవాడ నందు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. గత 4 సం.లు గా కృష్ణా జిల్లా సైన్స్ అధికారి (D.S.O) గా, 7 సం.లుగా APCOST జిల్లా కో- ఆర్డినేటర్ (D.C) గా పలు సైన్స్ కార్యక్రమాలలో విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించే విధంగా కృషిచేశారు. పర్యావరణ పరిరక్షణ కొరకు అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి కార్యక్రమాలు, సదస్సులు , ర్యాలీలు నిర్వహించారు. ఉపాధ్యాయుడిగా అనేక సైన్స్ ప్రదర్శనలలో తన విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. నానో టెక్నాలజీలో తన ప్రయోగానికి జాతీయస్థాయిలో అవార్డు లభించింది. అణుశక్తి- భవిష్యత్ ఇంధనం అనే అంశం పై ఈయన తయారు చేసిన పుస్తకం ప్రతిష్టాత్మకమైన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ నందు బుక్ ప్రైజ్ అవార్డు సాధించి పెట్టింది. భౌతిక, రసాయన శాస్త్రంలో కఠినఅంశాలపై ఇతను ప్రత్యేకంగా రూపకల్పన చేసిన యూట్యూబ్ ఛానల్ నందు రూపొందించిన వీడియోలు తెలుగు రాష్ట్ర విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విరివిగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా SCERT ప్రశ్నాపత్రాలు, మాడ్యూల్స్ తయారీలో కూడా తన సేవలు అందచేశారు.
Prajavartha Online Telugu News