-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-30 వ డివిజన్ 250 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మూడేళ్ల పాలనలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పడంతో ప్రజలలో సంతృప్తి స్థాయి నూటికి నూరు శాతం చేరిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 30 వ డివిజన్ 250 వ వార్డు సచివాలయ పరిధిలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గురువారం ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దేవీనగర్లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించి.. ప్రజాప్రతినిధులు, అధికారులు మధ్యకట్టలో విస్తృతంగా పర్యటించారు. 280 గడపలను సందర్శించి.. స్థానికుల నుంచి అర్జీలు, సూచనలు స్వీకరించారు. చంద్రబాబు లాగా అబద్దపు వాగ్దానాలతో పేదలను మోసపుచ్చడం తమకు తెలియదని మల్లాది విష్ణు అన్నారు. ప్రజలకు అందించిన సంక్షేమాన్ని పారదర్శకంగా బుక్ లెట్ల ద్వారా వివరించగలిగిన ఏకైక ప్రభుత్వం దేశంలో జగనన్న ప్రభుత్వం ఒక్కటేనని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క కుటుంబానికి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో నవరత్నాలతో పథకాలను రూపొందించి.. పేదరిక నిర్మూలన దిశగా ముందుకు సాగుతున్నారన్నారు. ఒక్క 250వ సచివాలయ పరిదిలోనే రూ. 3.52 కోట్ల సంక్షేమాన్ని డీబీటీ విధానంలో లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినట్లు వివరించారు. అనంతరం స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఎక్కడా తాగునీటి ఇబ్బంది రాకుండా ప్రజల అవసరాలను బట్టి మంచినీటి కనెక్షన్ ఇవ్వవలసిందిగా వీఎంసీ సిబ్బందికి సూచించారు. అలాగే దేవీనగర్ వంతెన పరిసర ప్రాంతాలలో రాత్రుళ్లు ఆకతాయిలు సంచరించకుండా గస్తీ పెంచాలని పోలీస్ శాఖను ఆదేశించారు. సమస్యాత్మక ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే దిశగా కూడా చూస్తామని తెలియజేశారు.
S.T.D.R.M.C. ఎలిమెంటరీ పాఠశాల సందర్శన
పర్యటనలో భాగంగా స్థానిక S.T.D.R.M.C. ఎలిమెంటరీ పాఠశాలను మల్లాది విష్ణు సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. అనంతరం నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రూ. 22 లక్షల నిధులతో చేపట్టిన వంటగది, మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ముందుగా ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయవలసిందిగా సూచించారు. నాణ్యత ప్రమాణాలతో పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేయవలసిందిగా ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలను నాటారు.
ఎన్టీఆర్ పేరు ఉచ్ఛరించే నైతిక అర్హత వెన్నుపోటుదారులకు లేదు
శాసనసభలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు జుగుప్సాకరమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు అసెంబ్లీకి రారని.. సభలో ఏవిధంగా గందరగోళం సృష్టించాలో టీడీపీ సభ్యులకు ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో తెలుగుదేశం ఘోర వైఫల్యం చెందిందని విమర్శించారు. చట్టసభలలో ప్రజా సమస్యలపై చర్చించవలసిందిపోయి.. వాటిని రాజకీయ వేదికలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ ను దుర్భాషలాడటం, పోడియం వద్ద కాగితాలు చించివేయడం వంటి చర్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. మరోవైపు హెల్త్ యూనివర్శిటీకి దివంగత మహానేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడం సమంజసమేనని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. స్వతహాగా రాజశేఖరరెడ్డి గారు డాక్టర్ కావడంతో.. ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి బృహత్తర పథకాలను రూపొందించి ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదల హక్కుగా మార్చారన్నారు. ఆరోగ్యరంగంలో మహానేత వైఎస్సార్ తీసుకొచ్చిన సంస్కరణలు స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి తీసుకురాలేదని చెప్పుకొచ్చారు. ఆయన హయాంలోనే అనేక మెడికల్ కాలేజీలు నిర్మితమయ్యాయని.. తెలుగుదేశం సుధీర్ఘ పాలనలో రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు కాలేదని వెల్లడించారు. మరీముఖ్యంగా చంద్రబాబునాయుడికి ఎన్టీ రామారావు గారి పేరు ఉచ్ఛరించే నైతిక అర్హత లేదని మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబు ఒక వెన్నుపోటుదారుడని, అతడో ఆషాఢభూతి అని, ఔరంగజేబు అని సాక్షాత్తూ ఎన్టీఆర్ గారే తన గుండెకోతను వివరించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని.. అధికారంలో లేనప్పుడే తెలుగుదేశం నాయకులకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు భారతరత్న తీసుకొచ్చే దిశగా కూడా టీడీపీ నేతలు కృషి చేయలేదని మండిపడ్డారు. కానీ పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అలాగే వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలను నాందిపలికిన మహానేత పేరును గుర్తు చేసుకునేలా హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సమంజసమేనని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు గోపిశెట్టి శ్రీను, డి.దుర్గారావు, సాసుపల్లి రామకృష్ణ, ప్రసాద్, మనోహర్, సాంబ, ఈశ్వర్, దుర్గరాజు, సామంతకూరి దుర్గారావు, ముద్రబోయిన దుర్గారావు, మార్తి చంద్రమౌళి, పిల్లి కృష్ణవేణి, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News