గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే మీట్ ది కమిషనర్ ప్రత్యేక గ్రీవెన్స్ ప్రతి గురువారం ఏర్పాటు చేశామని, కార్మికులు తమ సమస్యల పై నేరుగా తమకు అర్జీలు లేదా ఫిర్యాదులు అందించవచ్చని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు తెలిపారు. గురువారం నగర పాలక సంస్థ ఉద్యోగులు మరియు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు మీట్ ది కమిషనర్ ప్రోగ్రాంను కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ విభాగాల వారీగా కార్మికుల సమస్యల పరిష్కారంకు నిర్దేశిత గడువులోగా చర్యలు తీసుకోవాలని, గడువులోగా పరిష్కరించని అధికారుల పై చర్యలు తప్పవన్నారు. మరణించిన కార్మికులు లేదా ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఎటువంటి అవినీతికి పాల్పడినా భాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్మికులు కూడా తమకు అందే జీతాలు, ఇతర అలవెన్స్ లకై ఎవ్వరికీ ఎటువంటి నగదు ఇవ్వాల్సిన పని లేదని, ఎవరైనా నగదు డిమాండ్ చేస్తే ప్రతి గురువారం జరిగే గ్రీవెన్స్ లో నేరుగా తమ దృష్టికి తేవాలన్నారు. కార్మికులు తమ సమస్యల పై మీట్ ది కమిషనర్ లో ఇచ్చే వాటిని రిజిస్టర్ లో నమోదు చేసి, నిర్దేశిత గడువులోగా పరిష్కారం జరగాలని, ప్రతి వారం ఆర్జీలు, తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, సిఎంఓహెచ్ డాక్టర్ విజయలక్ష్మీ, వివిధ విభాగాల సూపరిండెంట్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News