విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీలను సీఎం జగన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని, సీఎం జగన్ రెడ్డి బీసీల ద్రోహి అని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సాదరబోయిన ఏడుకొండలు ఘాటుగా విమర్శించారు. శనివారం తెలుగుదేశం నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని) గారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు హాయంలో బీసీ ఫెడరేషన్లకు యేటా 100 నుంచి 200 కోట్లు రూపాయలు ఇస్తే జగన్ ప్రభుత్వ హయాంలో నామ్కే వాస్తుగా బీసీల కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, ఆయా ఆఫీసుల్లో కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. సీఎం జగన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వారి కుటుంబం మొత్తంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉందని వివరించారు. జగన్ రెడ్డి తాత ఒక బీసీ వ్యక్తికి చెందిన మైన్ ను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని, అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి 93 బిసి కులాలను 147 కులాలుగా పెంచి వారికి ఆ దామాషా ప్రకారం నిధులు, రిజర్వేషన్లు కల్పించలేదని విమర్శించారు. బీసీలతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, కాపులను సైతం సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ బీసీలను బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ గా భావించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించిందని చెప్పారు. అయితే సీఎం జగన్ రెడ్డి బీసీలను బెగ్గింగ్ క్లాస్ గా మార్చేసారని ఘాటుగా విమర్శించారు. పేరుకే కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న వారు తమ కులాల వారికి ఏ మాత్రం న్యాయం చేయలేక పోతున్నారని, వారు ప్రభుత్వంపై తిరగబడాలని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బిసి కులాల విద్యార్థులు దేశ, విదేశాల్లోని చక్కటి విద్యాసంస్థల్లో నాటి ప్రభుత్వ సహకారంతో చదువుకోగలిగారని వివరించారు . బీసీలకు ఆదరణ పథకం ద్వారా చేతి పనిముట్లు అందించారని, అయితే సీఎం జగన్ రెడ్డి ఆదరణ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో జగన్ రెడ్డికి బుద్ధి చెప్పి తెలుగుదేశంను అఖండ మెజారిటీతో గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏడుకొండలు చెప్పారు.
తెలుగుదేశం నాయకులు గణపా రాము మాట్లాడుతూ జగన్ రెడ్డి తన విధ్వంస కర పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. కాపులకు బిసి రిజర్వేషన్ ఇవ్వకుండా జగన్ రెడ్డి మోసం చేశారని ,కాపు కార్పొరేషన్ కు నిధులు ఇవ్వడంలేదని విమర్శించారు. ఈ సమావేశం తెలుగుదేశం మైనారిటీ నాయకులు మొహమ్మద్ ఇర్ఫాన్, తెలుగుదేశం నాయకులు బూదాల నంద కుమారి, పితాని పద్మ, మామిడి సత్యం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News