-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-60 వ వార్డు 264 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పేదల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం 60 వ డివిజన్ 264 వ వార్డు సచివాలయం పరిధి D-బ్లాక్ లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డివిజన్ ఇంఛార్జి బెవర నారాయణ, కోఆర్డినేటర్ బత్తుల దుర్గారావులతో కలిసి ఆయన పాల్గొన్నారు. 230 గడపలను సందర్శించి ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించడంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్లను అందజేశారు. ప్రభుత్వ పథకాలు శాచ్యురేషన్ పద్ధతిలో అర్హులకు సక్రమంగా అందుతున్నాయా లేదా..? అని ప్రజాభిప్రాయాలను సేకరించారు. 90 శాతం మంది సానుకూల స్పందన వ్యక్తం చేయడం సంతోషదాయకమన్నారు. గత ప్రభుత్వంలో వాంబేకాలనీ పూర్తి నిర్లక్ష్యానికి గురైందని మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్ లో రూ. 11.36 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు.. 36 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 14.23 లక్షల లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించారు. సచివాలయ పరిధిలో రూ.4.44 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు వివరించారు. మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న 43 వార్డు సచివాలయాల పరిధిలో.. 47 అభివృద్ధి పనులకు గానూ రూ. 7.38 కోట్లు మంజూరైనట్లు మల్లాది విష్ణు చెప్పారు. త్వరలోనే టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు.
J.D.M.M.C ఎలిమెంటరీ పాఠశాల సందర్శన
పర్యటనలో భాగంగా స్థానిక జంధ్యాల దక్షిణామూర్తి నగరపాలక సంస్థ ఎలిమెంటరీ పాఠశాలను మల్లాది విష్ణు సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. పాఠశాలలో మౌలిక వసతులపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఉన్నత పాఠశాలలో రూ. 1.30 కోట్ల నిధులతో జరుగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణాలు., రూ. 94 లక్షల నిధులతో చేపట్టిన నాడు-నేడు పనులను పరిశీలించారు. ముందుగా ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయవలసిందిగా సూచించారు. నాణ్యత ప్రమాణాలతో పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేయవలసిందిగా ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.
మధుమేహ పేషంట్లకు తెల్లవారుజామునే పరీక్షలు నిర్వహించాలి
ఉదయం 7 గంటల నుంచే అర్బన్ హెల్త్ సెంటర్లో షుగర్ టెస్టులు నిర్వహించాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి మల్లాది విష్ణు సూచించారు. స్థానిక వైఎస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. రోగులకు అందిస్తున్న సేవలు, అందుబాటులో ఉన్న మందులు, మలేరియా, డెంగ్యూ టెస్టులపై ఆరా తీశారు. ఆస్పత్రికి అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా..? అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆశా వర్కర్ల నుంచి హెల్త్ సెక్రటరీల వరకు ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
వైసీపీ హయాంలోనే పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యకు శాశ్వత పరిష్కారం
తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో అవినీతి తప్ప అభివృద్ధికి నియోజకవర్గం పూర్తిగా దూరమైందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అవ్వాతాతల పింఛన్ మొదలు పేదవాడి ఇంటి వరకు ప్రతి పనిలోనూ జన్మభూమి కమిటీల జోక్యంతో వ్యవస్థలన్నింటినీ అవినీతిమయం చేశారని మండిపడ్డారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిరహిత, మధ్యవర్తులు లేని పారదర్శక పాలనను సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువ చేయడం జరిగిందన్నారు. దీంతో రాష్ట్రంలో ప్రతిపక్షాల రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక.. టీడీపీ, బీజేపీ, జనసేన కలసి వ్యక్తిగత విమర్శలు, తెరవెనుక కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు నియోజకవర్గంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్యకు డిసెంబర్ నాటికల్లా శాశ్వత పరిష్కారం చూపుతామని మల్లాది విష్ణు వెల్లడించారు. అధికార యంత్రాంగమంతా అత్యధిక ధర నిర్ణయించినప్పటికీ.. ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 150 గజాల లోపు ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్ లు చేయవలసిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పేదల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనమని చెప్పుకొచ్చారు. ప్రజల అపూర్వ ఆదరణతో 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్ (ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, నాయకులు ఇస్మాయిల్, బాబు, ఫాతిమా, కుమారి, హనుమంతు దుర్గారావు, గురుమూర్తి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News