-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలపై త్వరలో సీపీఐ కార్యాచరణ చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. విజయవాడ దాసరిభవన్‌లో ఆదివారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన, రాక్షస పాలన కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ సంఘటనలను ఆయన ఉదాహరిస్తూ…మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుపై 12 కేసులు పెట్టారని, చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకుంటే తప్పులేదనీ, కాని పోలీసులు అర్థరాత్రి దొంగల్లా గోడలు దూకి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కోర్టులలో ఎన్నిసార్లు మొట్టికాయలు పడినా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. మరుసటి రోజు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు వేయడాన్ని తప్పుబట్టారు. రహదారులపై గుంతలు పూడ్చలేరు కానీ విస్తరణ పేరుతో ఇల్లు కూలుస్తున్నారనీ, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే ఆపడమేంటని, ఆయనకు ఆ గ్రామానికి వెళ్లే హక్కు లేదా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడిరచారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి వైసీపీకి పూర్తిగా సహకరిస్తోందనీ, అయినా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, నిధుల రప్పించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మోదీ పర్యటన సందర్భంగా ఈనెల 11వ తేదీన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరసిస్తూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని, విభజన హామీలు అమలు చేయాలనే తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ శ్రేణులు నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉప ఎన్నికపై రామకృష్ణ మాట్లాడుతూ పెట్టుబడిదారులు, ధనవంతులు, బడా కాంట్రాక్టర్లు ఎన్నికల్లో నిలబడితే, ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్లు, డబ్బులు ఖర్చుపెట్టె వాళ్లు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైతే ఇంకా ప్రజాస్వామ్యం ఏం ఉంటుందని ప్రశ్నించారు. వాళ్లంతా ప్రజలను కూడా ప్రభావితం చేస్తున్నారనీ, ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంస్కరణల కోసం చర్చ జరగాలన్నారు.
11 మందితో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం
ఈ నెల 4, 5 తేదీల్లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయనీ, ఈ సందర్భంగా పార్టీ అత్యున్నతమైన రాష్ట్ర కార్యదర్శివర్గాన్ని ఎన్నుకున్నామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. రాష్ట్ర కార్యదర్శివర్గ వివరాలిలా ఉన్నాయి. కె.రామకృష్ణ`రాష్ట్ర కార్యదర్శి, ముప్పాళ్ల నాగేశ్వరరావు`సహాయ కార్యదర్శి, జేవీ సత్యనారాయణమూర్తి`సహాయ కార్యదర్శి, కార్యదర్శివర్గ సభ్యులుగా మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, జి.ఓబులేసు, పి.హరినాథ్‌రెడ్డి, జి.ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్, డి.జగదీష్, జంగాల అజయ్‌కుమార్, పి.రామచంద్రయ్య ఉన్నారు. ఆహ్వానితులుగా డేగా ప్రభాకర్, కేంద్ర కార్యవర్గం తరపున ఆహ్వానితులుగా అక్కినేని వనజ ఉన్నారు. అలాగే రాష్ట్ర కార్యవర్గంలోకి మరో నలుగురిని ఆర్.రవీంద్రనాథ్, ఆవుల శేఖర్, సిహెచ్.కోటేశ్వరరావు, ఎ.మారుతీ వరప్రసాద్‌ను తీసుకున్నట్లు రామకృష్ణ వివరించారు. గతంలో 27 మంది కార్యవర్గసభ్యులతో కలిపి మొత్తంగా 31 మంది కార్యవర్గ సభ్యులు, మరో ముగ్గురు కార్యవర్గానికి ఆహ్వానితులుగా ఉన్నట్లు వివరించారు. రాష్ట్ర కౌన్సిల్‌కు మరో 25 మందిని కోఆప్ చేసుకున్నామని రామకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో రామకృష్ణతోపాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, జి.ఓబులేసు, కెవివి ప్రసాద్‌లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News