విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో రోగులకు తక్షణమే వైద్య సేవలు అందించాలని, నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు హెచ్ఛరించారు. డా. వైఎస్స్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు పై నగరంలోని కలెక్టరేట్ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయి క్రమశిక్షణా సంఘం సమావేశం ( డిస్టిక్ట్ డిసిప్లినరీ కమిటీ మీటింగ్) జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధ్యక్షతన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుప్రతి యాజమాన్యాలతో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రతీ పేదవానికి కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని అమలు చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా 3,255 చికిత్స మరియు శస్త్రచికిత్సలకు ఉచితంగా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వర్తించే వైద్య సేవలు అందించడంలో జాప్యం లేకుండా తక్షణమే సేవలను అందించేలా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంతో సహకరించాలన్నారు. చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేది రానిది నిర్థారణ చేసే సమయాన్ని జాప్యం లేకుండా వేగవంతం చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించే వైద్య సేవలు ఉచితమని, నిబంధనలకు విరుధ్దంగా రోగుల నుండి సొమ్ము వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ అనుమతులు రద్దు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పథకం నెట్ వర్క్ ఆసుపత్రులలో నిబంధనలను అతిక్రమించి అక్రమ వసూలుకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్యమిత్రలు, నిరంతరం అప్రమత్తంగా ఉండి రోగుల అవసరాలను తీర్చాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆసుపత్రులకు చెల్లించవలసిన సొమ్ము సకాలంలో 90 రోజుల వ్యవధిలో చెల్లించడం జరుగుతుందని, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం ఆసుపత్రికి వచ్చిన రోగిని స్వాగతించి సహనంతో వైద్య సహాయం అందించాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు. సమావేశంలో ఫిర్యాధు చేసిన లబ్దిదారుల నుండి ఫోన్ ద్వారా ఆసుపత్రిలో పొందిన సేవలు, నగదు వసూలు పిర్యాధుల పై జిల్లా కలెక్టర్ డిల్లీరావు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో కమిటీ కన్వీనర్, జిల్లా కో-ఆర్డినేటర్ డా.జె. సుమన్, కమిటీ సభ్యులు ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటి జిల్లా అధ్యక్షులు డా. జి.సమరం, డియంహెచ్‌వో డా. యం సుహసిని, ఆసుపత్రుల జిల్లా కో`ఆర్డినేటర్ డా.కెవి లక్ష్మీకుమారి, ఆరోగ్యశ్రీ ఎంపానల్ ఆసుపత్రుల యాజమాన్యాలు, వివిధ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు, ఆరోగ్యశ్రీ సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News