విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామపంచాయతీ సర్పంచ్ ల ఆధీనంలోనే గ్రామ సచివాలయముల కార్యకలాపాలు జరగాలని, వాలంటీర్లు, సిబ్బంది సర్పంచ్ ల ఆధీనంలో ఉండాలని సర్పంచ్ ల సంఘం రాష్ట్ర నాయకులు చిలకలపూడి పాపారావు అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ల గౌరవ వేతనమును 3 వేల నుండి 15వేల రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ పంచాయతీలలో గ్రాన్ అంబాసిడర్ జీతాలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలనీ, ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పిఎంఎఫ్ఎస్ లింక్ ఉన్న కొత్త బ్యాంకు ఖాతాలోనే డైరెక్ట్ గా కేంద్రం ప్రతి పంచాయతీ కొత్త ఖాతా లోనే వేయాలని కోరారు. గడప గడపకు ప్రోగ్రాం క్రింద ప్రతి సమస్యల పరిష్కారానికి విడుదల చేస్తున్న 20 లక్షల నిధులు సర్పంచ్ ల పరిధిలో జరిగే విధంగా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. మైనర్ పంచాయతీ కరెంట్ బిల్లులు, తాగునీటి సరఫరా, వీధిలైట్లకు అయ్యే ఖర్చులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరించాలని అన్నారు. సచివాలయంల ద్వారా వచ్చే ఆదాయమును గ్రామపంచాయతీ ఖాతాలోని వేయాలని సూచించారు. సర్పంచులు విధి నిర్వహణలో మరణిస్తే 20 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం ప్రభుత్వమే భరించాలని తెలిపారు. మైనర్, మేజర్ గ్రామపంచాయతీలకు విద్యుత్ శాఖ వారు ఇష్టానుసారంగా సబ్ చార్జెస్ వేస్తున్నారని, వాటిని పూర్తిగా రద్దు చేయాలని తెలియజేశారు. గ్రామ పంచాయతీలు సిబ్బందికి రివైజ్డ్ పే స్కేల్స్ భరించే స్థితిలో లేవని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సర్పంచులు బిల్లును అప్లోడ్ చేసిన వెంటనే బిల్లులు పాస్ అయ్యే విధంగా రాష్ట్ర ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పాపారావు వెల్లడించారు. ఈ సమావేశంలో సర్పంచ్ ల సంఘ నాయకులు శివచంద్రారెడ్డి, ముప్పాళ్ళ మనోహర్, టి కృష్ణమోహన్, కే నరేంద్ర, వరి శ్రీదేవి, అల్లా బక్షు, తాడికొండ నరసింహారావు, మంచాల సాంబశివరావు, మేకతోటి శ్రీకాంత్, కల్లూరు శ్రీనివాసరావు, రామయ్య, శివారెడ్డి, రాము, జాస్తి వీరాంజనేయులు, పెనుమాల సునీత ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News