గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీ పార్క్ అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని, కాంట్రాక్టర్ కు పనుల వారీగా నిర్దేశిత గడువు విధించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ నగరపాలక సంస్థ ఎస్.ఈ.ని ఆదేశించారు. గురువారం కమిషనరు తమ పర్యటనలో భాగంగా గాంధీ పార్క్ అభివృద్ధి పనులు, మహబూబ్ నగర్ లో నూతనంగా నిర్మాణం చేసిన సిసి డ్రైన్ ను తనిఖీ చేసి ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుత గాంధీ పార్క్ ను పరిశీలించి పనుల పురోగతి పై ఎస్.ఈ., కాంట్రాక్టర్ లను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ గాంధీ పార్క్ గుంటూరు నగరానికి కీలకమైనదని, పనులు వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నగరం మధ్యలో ఉన్న పార్క్ లో వాకింగ్ ట్రాక్, గ్రీనరి, ఓపెన్ జిమ్, ప్లే ఎక్విప్మెంట్స్ ఏర్పాటు ప్రణాళికాబద్దంగా జరగాలన్నారు. స్కేటింగ్ రింగ్ కూడా మరింత అధునాతన విదానంలో పునర్నిర్మాణం చేయాలన్నారు. పార్కింగ్, స్టాల్స్, మరుగుదొడ్ల ఏర్పాటు పక్కాగా ఉండాలన్నారు. ఇక నుండి ప్రతి వారం పార్క్ అభివృద్ధి పనులను నేరుగా సమీక్షిస్తామని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ కి సూచించారు.
అనంతరము మహబూబ్ నగర్ లో నూతనంగా రూ.20 లక్షలతో 584 మీటర్ల నిర్మాణం చేసిన సిసి డ్రైన్ ను కొలతలు, నాణ్యతను పరిశీలించారు. అభివృద్ధి పనులను క్వాలిటి కంట్రోలర్ ఆయా స్టేజిల్లో పక్కాగా రికార్డ్ చేయాలని, నివేదికలో లోపాలుంటే తగు చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ గారు మాట్లాడుతూ సచివాలయం పరిధిలో ప్రతి నిర్మాణం నగరపాలక సంస్థ అనుమతి తీసుకున్న ప్లాన్ ప్రకారమే ఉండాలని, అనధికార నిర్మాణాలు, లే అవుట్స్ ఉంటే ప్లానింగ్ కార్యదర్శి పై చర్యలు ఉంటాయన్నారు. ప్రతి నిర్మాణం అసెస్మెంట్ కల్గి ఉండాలని, నూతన భవనాలకు ఎప్పటికప్పుడు పన్ను విధించాలని అడ్మిన్ కార్యదర్శులను ఆదేశించారు. ట్రేడ్ లైసెన్స్, ఇంటింటి చెత్త కలెక్షన్ పక్కాగా జరగాలని శానిటేషన్ కార్యదర్శులను, త్రాగునీటి సరఫరా సమయంలో క్లోరిన్ శ్యాంపిల్స్ తీయాలని ఎమినిటి కార్యదర్శులను ఆదేశించారు.
పర్యటనలో 51 వార్డ్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి, ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ.లు కోటేశ్వరరావు, కొండారెడ్డి, డి.ఈ.ఈ. శ్రీనివాసరెడ్డి, ఏడి.హెచ్. రామారావు, ఏ.ఈ.లు సేతుబాబు, రాంబాబు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News