గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్ల విస్తరణ కీలకమని, 2012లో విస్తరణ పనులు ప్రారంభించి, అసంపూర్తిగా నిలిచి ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా ఉన్న డొంక రోడ్ మూడవ విడత రోడ్ విస్తరణ పనులు నిబందనల మేరకే పునఃప్రారంభం చేశామని, ప్రజలు సంయమనం పాటిస్తూ నగరాభివృద్ధికి సహకరించాలని నగర కమిషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. కోరారు. గురువారం కమిషనరు తమ చాంబర్ లో రోడ్ల విస్తరణ పై సిటి ప్లానర్ మూర్తితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత 3 నెలల నుండి నగరంలో ఎంతో కాలం నుండి పెండింగ్ లో ఉన్న రోడ్ల విస్తరణ పనులను వేగంగా చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే పెద్ద పలకలూరు, నందివెలుగు, కొత్తపేట రోడ్ విస్తరణ పనులు దాదాపు పూర్తి అయ్యాయని, నూతనంగా చేపట్టిన ఏటి అగ్రహారం రోడ్ కూడా వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. ఆయా రోడ్లలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు నిధుల మంజూరు కూడా జరిగి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. గుంటూరు నగర పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలకు అనుసంధానం చేసే శంకర్ విలాస్ ఆర్.ఓ.బి.ని నూతనంగా నిర్మాణం చేయడానికి రాష్ట్ర మైనారిటీ దినోత్సవంలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి నిధులు మంజురుకు హామీ ఇచ్చారన్నారు. కీలకమైన శంకర్ విలాస్ ఆర్.ఓ.బి. పనులు ప్రారంభిస్తే పశిమ్చ నియోజకవర్గం, అమరావతి రోడ్ నుండి వచ్చే ట్రాఫిక్ అంతా శ్రీనగర్ మీదుగా డొంక రోడ్ లోకే రావాల్సి ఉంటుందని, అంతటి కీలకమైన డొంక రోడ్ విస్తరణ అత్యావశ్యకమన్నారు.
డొంక రోడ్ విస్తరణకు 2012లోనే ఆర్.డి.పి. తయారై 40 అడుగుల నుండి 60 అడుగులకు ఆమోదం పొంది ఒక వైపు పనులు జరిగాయన్నారు. ప్రస్తుతం రోడ్ బాగా గోతులతో స్థానిక ప్రజలు, వాహనదార్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించడం, మీడియాలో కూడా వరుస కధనాలు ప్రచురితం అవ్వడంతో నిలిచిన పనుల పునఃప్రారంభంకు చర్యలు తీసుకున్నామన్నారు. డొంక రోడ్ నుండి కొత్తపేట హాస్పిటల్కు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్తితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే ప్రభావిత ప్రాంత స్థానికులు విస్తరణకు వారి అంగీకార పత్రాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు వంటి తదితర వివరాలు నగరపాలక సంస్థకు అందించారన్నారు. బుధవారం అంగీకారం తెలిపీన వారిలో 10 గృహాల్లో 2 గృహాల వారు స్వచ్చందంగా తొలగించుకున్నారని, మరో 8 గృహాలకు కేవలం కాంపౌండ్ వాల్, మెట్లు, మరుగుదొడ్లను మాత్రమే నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారని పేర్కొన్నారు. డొంక రోడ్ విస్తరణలో ప్రభావితం అయ్యే వారిలో బి.ఫారాలు ఉన్న వారికీ చట్ట ప్రకారం టి.డి.ఆర్. బాండ్లు ఇవ్వడం వీలు లేకపోవడం వలన, నష్ట పరిహారం ఇవ్వడానికి గౌరవ మేయర్ గారు కూడా హామీ ఇచ్చారని, స్వాధీనాల్లో ఉన్న వారిలో అర్హులను గుర్తించి జగనన్న లే అవుట్స్ లో ఇంటి స్థలం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుధవారం డొంక రోడ్ విస్తరణ పనులు చేసే క్రమంలో కొందరు అపోహలతో అడ్డుకున్నారని, వాస్తవానికి వారి ఇళ్ల తొలగింపు ప్రస్తుతం లేదన్నారు. కాని కొన్ని మీడియాలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విస్తరణ పనులు చేపట్టి ఇళ్లు తొలగించారని వచ్చిన వార్తలో వాస్తవం లేదన్నారు. గత 3 నెలల కాలంలో పూర్తి చేసిన పెండింగ్ రోడ్లు అయిన పెద్ద పలకలూర, ఏ.టి.అగ్రహారం, కొత్తపేట, నందివెలుగు రోడ్లకు నిర్దేశిత నిబందనల మేరకే పనులు చేశామని, ఎక్కడా ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. నగర అభివృద్ధికి, ప్రజలు ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా సాఫీగా ప్రయాణం చేయడానికి రోడ్ల విస్తరణ పనులు అత్యావశ్యకమని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News