-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టిఆర్ జిల్లా, వీరులపాడు మండల కేంద్రాన్ని రాజకీయ దురుద్దేశ్యాలతో జుజ్జూరుకు మార్చడం తగదని, వీరులపాడులోనే మండల కేంద్రాన్ని కొనసాగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎన్‌టిఆర్ జిల్లా, వీరులపాడు మండల కేంద్రాన్ని ఇటీవల వీరులపాడు నుండి జుజ్జూరుకు మారుస్తున్నట్లు ప్రకటించారు. గత 35 ఏళ్లుగా వీరులపాడులోనే ఉన్న వీరులపాడు మండల కేంద్రాన్ని రాకపోకలకు ఇబ్బంది కలుగుతాయనే సాకుతో జుజ్జూరుకు మార్చడం తగదు. వీరులపాడులో పలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మితమై పనిచేస్తున్నాయి. వీరులపాడుకు గత 35 ఏళ్లుగా రాని రవాణా ఇబ్బందులు, ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడిన ప్రస్తుత తరుణంలో వస్తాయని చెప్పడం కుంటిసాకులు మాత్రమే. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు తరలించడం రాజకీయ దురుద్దేశ్యంతో కూడుకున్నది. అంతేకాకుండా నూతనంగా మండల కేంద్రం ఏర్పాటుకు స్థలాలు సమకూర్చుకోవడంతోపాటు భవనాల నిర్మాణాలకు నిధుల వంటివి అత్యంత ఖర్చుతో కూడుకున్నది. ఇప్పటికే వీరులపాడునే మండల కేంద్రంగా కొనసాగించాలని కోరుతూ ప్రజాందోళనలు సాగుతున్నాయి. కనుక 35 ఏళ్ల చరిత్ర కలిగిన వీరులపాడు మండల కేంద్రాన్ని యధావిధిగా వీరులపాడులోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News