రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పౌరులకు మెరుగైన సుపరిపాలన ను పారదర్శకంగా, జవాబుదారీ తనం తో కూడి అందించే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకుని రావడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.
స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం గుడ్ గవర్నెన్స్ వారోత్సవాలు సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పై కార్యశాల కు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జవాబుదారీతనం తో కూడి అర్హులైన వారికి రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కుల ప్రయోజనాలు కలుగ చెయ్యడం ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. సుపరిపాలన దిశగా గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకుని రావడం జరిగిందన్నారు. నేడు ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో ప్రజలకు చేరవేయడం లో మానవ వనరుల పరంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చారన్నారు సేవా భావం తో కూడి ఇంటి వద్దనే అర్హులును గుర్తించడం ఇందులో అత్యంత అవసరం అని జేసీ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాలు ద్వారా 540 పౌర సేవలు నేరుగా పొందాలంటే వాటికి వారధిగా వాలంటీర్ లు నిబద్దతతో పనిచెయ్యడం, అధికారులు పర్యవేక్షణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా సుపరిపాలన సాధ్యం అవుతుందని తేజ్ భరత్ పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు (SDG) చేరవేయడానికి అంకిత భావంతో పని చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 3,52,42,034 సేవా విజ్ఞప్తులు రాగా ఇప్పటి వరకు 3,50,17,961 సేవలు అందించగలగడంలో మానవ వనరుల ద్వారా మాత్రమే సాధ్యం అయినట్లు తెలిపారు.
సమగ్ర అభివృద్ధి లో భాగంగా విద్యకు తగిన ప్రాధాన్యత కల్పించడం, నిరక్ష్యరాశులు లేకుండా అందరికీ విద్య అందచేసే క్రమంలో బడి బయట పిల్లలను గుర్తించి స్కూల్స్ కి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్య ద్వారా ఉపాధి, భద్రత పై అవగాహన కల్పించడం సాధ్యం అవుతుందన్నారు. వీటితో పాటు సచివాలయ సిబ్బంది జెండర్ సమానత్వం, బాల్య వివాహాలు అరికట్టడం, మహిళల , బాలికల భద్రత కోసం దిశా, ఫాక్సో చట్టం పై అవగాహన అవసరం అన్నారు.
గ్రామ స్వరాజ్యం ద్వారా మాత్రమే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని గాంధీజీ కలలు సాకారం దిశగా రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని వక్తలు అభిప్రాయపడ్డారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యాలను సాధించడం ద్వారా గుడ్ గవర్నెన్స్ లక్ష్యాలను చేరుకోగలమన్నారు.
ఈ సమావేశానికి డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు పి. వీణా దేవి, కే. శాంత మణి, సామర్ల కోట శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ పి. శ్రీనివాస రావు, పలువురు ఎంపిడివో లు, సచివాలయ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News