-ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్
-దేశ ఇంధన సామర్థ్య లక్ష్యాల సాధనకు ఏపీఎస్ఈసీఎం చర్యలు దోహదం
-భారతదేశంలో ఇంధన పొదుపు.. ప్రపంచానికే విజయగాథ
-దేశ ‘వాతావరణ మార్పు’ లక్ష్యాల సాధనలో ఇంధన సామర్థ్యమే కీలకం
-ఇంధన పొదుపు, సంరక్షణలో ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలూ అనుసరించాలి
-ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ డీజీ డాక్టర్ అజయ్ మాథుర్ వ్యాఖ్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం)కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. వాతావరణ మార్పులకు సంబంధించి భారత్ లక్ష్యాల సాధనకు ఏపీఎస్ఈసీఎం చర్యలు ఎంతగానో దోహదపడుతున్నాయని సాక్షాత్తూ అంతర్జాతీయ సంస్థ ‘ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఏ)’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్ కొనియాడారు. ఇంధన పొదుపు, సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ మేటి అని పేర్కొన్నారు. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఎనలేనిదని అన్నారు. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుతో జాతీయ స్థాయిలో పలుమార్లు పురస్కారాలు అందుకున్న ఏకైక ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎస్ఈసీఎం అని కితాబిచ్చారు. 2070కల్లా నెట్ జీరో ఉద్గారాలకు చేరుకోవాలన్న భారతదేశ లక్ష్య సాధనకు రాష్ట్రాలన్నీ త్రిముఖ వ్యూహాన్ని అనుసరించాలని తెలిపారు.
ఐఎస్ఏ 110 సభ్య దేశాలు కలిగిన, భారతదేశంలో ప్రధాన కార్యాలయం ఉన్న అంతర్జాతీయ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధన అందుబాటు, ఇంధన భద్రతను మెరుగుపరచడానికి.. కర్బనరహిత భవిష్యత్తుకు మారడంలో సౌర శక్తిని సుస్థిరమైన మార్గంగా ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో కలిసి పనిచేస్తుంది. ఇంతటి ప్రతిష్ఠాత్మక సంస్థకు డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ అజయ్ మాథుర్ ఏపీఎస్ఈసీఎంను, ఏపీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడం రాష్ట్రానికే గర్వకారణం.
వాతావరణ మార్పులకు సంబంధించి భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు ప్రతి రాష్ట్రం ఇంధన సామర్థ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని మాథుర్ చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలన్నారు. ఇంధన సామర్థ్య సాంకేతికతల వినియోగం బాగా పెంచాలని, సాధారణ ప్రజలను కూడా పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ‘ఎనర్జీ ఎఫిషియన్సీ మ్యాటర్స్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఆయన ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డికి పుస్తకాన్ని అందజేశారు. ఈ పుస్తక రచయితల్లో డాక్టర్ అజయ్ మాథుర్ కూడా ఒకరు.
భారతదేశంలో ఇంధన సామర్థ్యం అనేది ప్రపంచానికే ఒక విజయగాథ అని మాథుర్ తెలిపారు. ఉన్నత జ్యోతి అఫర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్ (ఉజాలా), జాతీయ ఎల్ఈడీ వీధి దీపాల కార్యక్రమం, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్, ఎకో-నివాస్ సంహిత , ప్యాట్ (పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్), వంటి పలు పథకాలను ఆయన ప్రస్తావించారు. ఇంధన పొదుపు, సామర్థ్యంపై సామాన్యులకు సైతం మరింత అవగాహన కల్పించడమే తన పుస్తకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ పుస్తకంలో ఇంధన పొదుపులో అత్యుత్తమ విధానాలను ప్రముఖంగా ప్రస్తావించినట్లు తెలిపారు. దేశంలో ఇంధన పొదుపు ద్వారా గణనీయమైన ఆర్థిక వృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో ఉజాలా ఎల్ఈడీ పథకాన్ని అమలు చేయాలని తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ద్వారా దేశంలో రూ.20 వేల కోట్ల విద్యుత్తు బిల్లులు ఆదా అయ్యాయని మాథుర్ గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా మధ్య తరగతి, పేద ప్రజలకు భారీ స్థాయిలో కరెంటు బిల్లులు తగ్గాయని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనియాడారు.
ప్రతిష్ఠాత్మకమైన ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను అందుకున్న ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎస్ఈసీఎంను మాథుర్ అభినందించారు. ఇంధన వినియోగం ఆధారంగా దేశంలోని రాష్ట్రాలను నాలుగు గ్రూపులుగా విభజించగా.. రెండో గ్రూపులో ఉన్న ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ పనితీరుతో అగ్రస్థానంలో నిలవడం ముదావహమని పేర్కొన్నారు. ఎల్ఈడీ బల్బుల పంపిణీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో అన్ని శాఖలనూ భాగస్వాములను చేయడం, అన్ని విభాగాల్లోనూ ఇంధన సంరక్షణ సెల్స్ ఏర్పాటు చేయడం వంటి చర్యలను కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ విధానాలను అనుసరించాలంటూ కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి అన్ని రాష్ట్రాలకూ రాసిన లేఖలో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇంధన సంరక్షణ, ఇంధన సామర్థ్య కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా సంస్థ (ఏపీఎస్ఈసీఎం)ను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశమేనని.. ఇందుకు ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని మాథుర్ పేర్కొన్నారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో, పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఇంధన సామర్థ్యానిదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు.
‘‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీలు దాటి 2.6-4.8 డిగ్రీ సెంటిగ్రేడ్ లకు పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 నుంచి 45 టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. వచ్చే 10 ఏళ్ళ లో ఇది 480 నుంచి 490 టన్నులకు చేరే అవకాశం ఉంది. ఈ ఉద్గారాలు 500 గిగా టన్నులకు మించి పెరిగితే వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. దానివల్ల సముద్ర మట్టాలు పెరగటం, వేడి పెరగటం, రుతుక్రమాల్లో మార్పులు, తరచుగా పెను తుఫానులు రావడం, పంటల దిగుబడి తగ్గటం, వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించుకోకపోతే దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం అవుతాయి’’ అని మాథుర్ వెల్లడించారు.
దేశ విద్యుత్తు మార్కెట్లో గృహ వినియోగదారులది కీలక పాత్ర అన్నారు. 2015తో పోలిస్తే 2030కల్లా ఇళ్లలో సగటు విద్యుత్తు వినియోగం 1.5 నుంచి 2.5 రెట్లు పెరగనుందని చెప్పారు. అంటే ఏటా 5 నుంచి 7.8 శాతం విద్యుత్తు వినియోగం పెరగనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యుత్తును జాగ్రత్తగా వాడుకోవడం, ఇంధన సంరక్షణపై సాధారణ వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని.. అలా చేస్తే విద్యుత్తు డిమాండుతో పాటు కర్బన ఉద్గారాలనూ తగ్గించవచ్చని వివరించారు.
దేశ విద్యుత్తు అవసరాల్లో సగం మేరకు పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవడం, 2030కల్లా 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడం వంటి కేంద్రప్రభుత్వ లక్ష్యాలను సాధించుకుంటే యావత్ దేశానికే మంచిదని.. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన పర్యావరణం అందుబాటులోకి వస్తుందని ఐఎస్ఏ డీజీ మాథుర్ తెలిపారు. ఇంధన పొదుపులో వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని.. అది దేశానికి, ప్రపంచానికే మంచిదని చెప్పారు.
ఇంధన సంరక్షణ, సామర్థ్య కార్యక్రమాల అమలులో ఏపీఎస్ఈసీఎంకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన ఐఎస్ఏ డీజీ అజయ్ మాథుర్ కు ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 2030కల్లా 6.68 ఎంటీఈవో విద్యుత్తును ఆదా చేయాలని బీఈఈ లక్ష్యంగా నిర్దేశించిందని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఏపీఎస్ఈసీఎం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పారు.
సిఇఒ ఎపిఎస్ఇసిఎం ఈ అభివృద్ధిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌కు వివరించగా, ఎపిఎస్ఇసిఎమ్ విజయాలపై ఐఎస్ఎ చీఫ్ అజయ్ మాథుర్ చేసిన గొప్ప వ్యాఖ్యలకు ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ , ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మద్దతు, వివిధ ప్రభుత్వ శాఖల సహకారం , ప్రధానంగా వినియోగదారులు, భాగస్వాముల సంపూర్ణ సహకారం, రాష్ట్రం ఇంధన సామర్థ్య రంగంలో విజయం సాధించడానికి సహాయపడినట్లు సిఈ ఓ ఏపీఎస్ఈ సిఎం ఈ కార్యక్రమంలో వెల్లడించారు
Prajavartha Online Telugu News