విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘‘అమ్మకు అక్షర నైవేద్యం’’ మహా సంకలనానికి రెండు అంతర్జాతీయ అవార్డులు రావడం సూర్తిదాయకమని, సంపాదకురాలు బండి ఉష అభినందనీయురాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు కొనియాడారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం సంకలన సంపాదకురాలు బండి ఉష ‘‘అమ్మకు అక్షర నేవేద్యం’’ సంకలనాన్ని కలెక్టర్ డిల్లీరావుకు అందజేశారు. ఈ సందర్భంగా సంకలనాన్ని పరిశీలించి తెలుగు సాహితీ చరిత్రలో అతి పెద్ద సంకలనం అని, 526 మంది కవులు స్పందించి తమ కవితలు, పద్యాలు, గేయాలను హైదరాబాదులోని సింహ వాహిని అమ్మవారిని స్తుతిస్తూ అక్షర నైవేద్యం పెట్టడం చిన్న విషయం కాదని, అనన్య సమాన్యమని అన్నారు. ఇందులో 20 మంది సినీ కవులు, 80 మంది డాక్టరేట్లు, 300 మంది తెలుగు పండితులు మరో 100 మంది ప్రతిష్టులైన కవులు ఈ పుస్తకంలో తమ కవితా ధారలు కురిపించారని కనుకనే ఇది తెలుగు రాష్ట్రాలలో మహా సంకలనంగా ముందుకు వచ్చిందన్నారు. బండి ఉష రచించిన ‘‘గ్రహణం వీడిన వేళ’’, ‘‘శారదరాత్రులు’’ కథా సంపుటులను కూడా కలెక్టర్‌కు బహుకరించారు. పుస్తకాలను పరిశీలించిన కలెక్టర్ రచయిత్రి బండి ఉషను అభినందించారు.
Prajavartha Online Telugu News