-మందకృష్ణ మాదిగ వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పాటుపడిన మహోన్నత వ్యక్తి, సామాజిక న్యాయానికి ప్రతిరూపం వంగవీటి మోహన్ రంగా అని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మంద కృష్ణ మాదిగ కొనియాడారు. వంగవీటి మోహన్ రంగా 34 వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో కాపు నాయకులు కొలనుకొండ శివాజీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన రంగా 34 వర్ధంతి కార్యక్రమానికి మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటు శత్రువుల ద్వేషం, ఇటు సొంత పార్టీలో ఈర్ష్య రంగా హత్యకు కారణమని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. ఆధిపత్య కులాలకు, బడుగు బలహీన వర్గాల మధ్య జరిగిన పోరులో జరిగిన రంగా హత్య, రెండు వర్గాల మధ్య జరిగిన గొడవగా చిత్రీకరించారని అన్నారు. తెలుగు నేలను ప్రభావితం చేసిన అత్యంత శక్తివంతుడు, సామాజిక న్యాయానికి ప్రతిరూపం రంగా అని కొనియాడారు. ఏటువంటి అధికారం లేకుండా అందరినీ ప్రభావితం చేసిన ఏకైక వ్యక్తి రంగా అని అన్నారు. ప్రత్యర్థ పార్టీలైన, శత్రు పార్టీలైన ఏ పార్టీ అయినా రంగ స్ఫూర్తి గురించి చెబుతారని ఆయన పేరు ఉపయోగించుకుంటారని తెలియజేశారు. 34 సంవత్సరాలు కాదు, ఇంకా 300 సంవత్సరాలైనా ప్రజలలో రంగా ప్రభావం, ఆయన స్ఫూర్తి అలానే ఉంటుందని చెప్పారు. రంగ నిబద్ధతతో పనిచేశారని, దీర్ఘకాలంగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డారని అందుకే శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ మాట్లాడుతూ రంగా బ్రతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించే వారిని, గొప్ప జాతీయ నాయకుడు అయ్యవారిని చెప్పారు. రంగా బ్రతికి ఉండగా కాంగ్రెస్ పార్టీని బతికించారని ఆయన మరణాంతరం కూడా కాంగ్రెస్ పార్టీని బతికించారని అన్నారు. జాతీయ కాపు నాయకులు గోళ్ళ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాధా రంగా మిత్రమండలి సముద్రం లాంటిదని, దీనిని సక్రమంగా నడిపిస్తే అతిపెద్ద పార్టీ అవుతుందని చెప్పారు. రంగా పేరు తలవకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు వెళ్లలేదని అన్నారు. ఆయనకు నిజమైన నివాళి ఆయన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెవెళ్ళడమే అని సూచించారు. కాపు నాయకులు, రాధా రంగా మిత్రమండలి నాయకులు పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు రంగాను అడుగడుగున ఆరాధించారని అన్నారు. అధికారంలోకి వచ్చాక వంగవీటి రంగా పేరును జిల్లాకు పెట్టాలని కోరితే కనీసం పరిశీలనలో కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జిల్లాకు వంగవీటి రంగా పేరును, కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకు అందిస్తున్న పథకానికి రంగా పేరు పెట్టాలని, అలానే స్మృతి ఘాట్ ఏర్పాటు చేయటానికి స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బాడితి శంకర్, అల్లం రాజేష్, చెన్నుపాటి శ్రీను, ఖాదర్, అల్లం పూర్ణ, దర్శి వాసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, గురునాథం,రంగా అభిమానులు పలువురు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News