గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ సిటిజన్ పర్స్ ప్షన్ సర్వేలో గుంటూరు నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, జాతీయ స్థాయిలో 6వ స్థానంలో నిలవడం గుంటూరు నగరానికి గర్వకారణమని, ఇందులో భాగస్వాములైన నగర ప్రజలు, సచివాలయ కార్యదర్శులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర అభివృద్ధి, మౌలిక వసతులు, ఇతర అంశాల పై కేంద్ర ప్రభుత్వం సిటిజన్ పర్స్ ప్షన్ సర్వే చేపడుతుందన్నారు. సర్వేలో దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడి గుంటూరు నగరం జాతీయ స్థాయిలో 6, రాష్ట్ర స్థాయిలో తొలి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన సర్వేలో పాల్గొన్న ప్రజల శాతంలో జాతీయ స్థాయిలో తొలి స్థానం నగరానికి దక్కిందన్నారు. సర్వేలో నగరానికి మంచి ర్యాంక్ రావడం ద్వారా నగరంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉందన్నారు. నగర ప్రజలకు సర్వే పై అవగాహన కల్గించి దేశ స్థాయిలో ప్రతిష్టాత్మక సర్వే లో గుంటూరు నగరం అత్యత్తమ స్థానంలో నిలిచేలా నోడల్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు టీం వర్క్ తో కృషి చేశారని, సర్వే ద్వారా నగర అభివృద్ధి, మౌలిక వసతులపై నగర ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకోవడానికి నేరుగా అవకాశం కల్గిందన్నారు.
Prajavartha Online Telugu News