
-మాల మహానాడు ఐక్య వేదిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం రద్దు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని, ప్రభుత్వం రద్దు చేసిన 27 దళిత సంక్షేమ పథకాలను పునరుద్దరించాలని మాల మహానాడు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుర్రం రామారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దళితులను అణగదొక్కుతున్నదని, దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారి సంక్షేమ పథకాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. సంక్షేమ పథకాలను పునరుద్దరించాలని, లేదంటే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మృతిని తట్టుకోలేక చనిపోయిన 800 మందిలో అత్యధికులు దళితులేనని సీఎం జగన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. దళితులను విస్మరిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. దళితులపై హత్యలు, అత్యాచారాలకు పాల్పడిన వారికి 41 నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయాలన్నారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ప్రభుత్వం రద్దు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని తిరిగి కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుపరచాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అందించాలన్నారు. కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షలు భీమా పరిహారం ఇవ్వాలన్నారు. ఆ కార్యక్రమంలో నాయకులు గుర్రం నారాయణ, జి.తేజ, పి.మహేష్, జి.మురళీ, ఎన్.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News