గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, హౌసింగ్, నగరపాలక సంస్థ అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో ఇంజినీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం, స్వచ్చ సర్వేక్షణ్, అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని, లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణం చేసుకునేలా సచివాలయ కార్యదర్శులు, నోడల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి ప్రతి లే అవుట్ లో ఇళ్ళ గృహ ప్రవేశాలకు సిద్దం చేయాలన్నారు. లే అవుట్ ల వారిగా ఎప్పటికప్పుడు పనుల పురోగతి పై నివేదిక ఇవ్వాలని, ఏ సమస్య ఎదురైనా అధికారులు సమన్వయంతో పరిష్కరించి పనుల వేగవంతంకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్చ సర్వేక్షణ్ 2023లో భాగంగా టాయ్ లెట్ 2.1 మేరకు నగరంలోని పబ్లిక్ టాయ్ లెట్స్ మరమత్తులు వెంటనే పూర్తి చేయాలని, టాయ్ లెట్స్ వద్ద వాష్ బేసిన్స్ ఏర్పాటు చేయాలని ఏ.ఈ.లను ఆదేశించారు. పొన్నూరు రోడ్ లోని మెటీరియల్ రికవరి ఫెసిలిటి కేంద్రం సర్వే చేసి, కాంపౌండ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు పంపాలని డి.ఈ.ఈ.ని ఆదేశిచారు. గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ పనులు ఈ నెలలో పూర్తి చేయాలని, సదరు కాంట్రాక్టర్ తో సమన్వయం చేసుకోవాలన్నారు. అలాగే గాంధీ పార్క్ పనులు కూడా వేగంగా జరగాలని ఈ.ఈ. నేరుగా పర్యవేక్షణ చేయాలని, అరండల్ పేట పార్క్ లో వ్యర్ధాలతో బొమ్మలు తయారు చేయించి మోడల్ గా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించి, ప్రతి సచివాలయం పరిధిలో పనులు వేగంగా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ జరిగేలా ఎమినిటి కార్యదర్శులు పరిశీలించాలన్నారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ. భాస్కర్, హౌసింగ్ పి.డి. సాయినాద్ కుమార్, ఈ.ఈ.లు సుందర్రామిరెడ్డి, కొండారెడ్డి, కోటేశ్వరరావు, హౌసింగ్, నగరపాలక సంస్థ డి.ఈ.ఈ.లు, ఏ.ఈ.లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News