-పరిశ్రమలకు అన్ని విధాలా సహకారం అందిస్తాం: కలెక్టర్
శ్రీసిటీ, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలమని, పరిశ్రమలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి పారిశ్రామిక వేత్తలతో అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీసిటీ లోని సమావేశ మందిరంలో వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటుకు జిల్లాలో ఎంతో అనుకూల వాతావరణం ఉందని, పుష్కలమైన వనరులు, రైల్వే, విమాన, రోడ్డు మార్గాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించే దిశలో సింగిల్ డెస్క్ పారిశ్రామిక విధానంలో అనుమతులు ఇవ్వడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వలన పరిశ్రమల స్థాపనకు కావలసిన అన్ని అనుమతులు సులభతరం అయ్యాయని అన్నారు. రాష్ట్ర పురోభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యంకు ఎంతో ప్రాధాన్యం ఉన్నదని అన్నారు. మన ముఖ్యమంత్రి నూతన పరిశ్రమల ప్రోత్సాహానికి పెద్ద పీట వేసి ఎం ఎస్ ఎం ఈ లను, కొత్త ఎంటర్ ప్రెన్యూర్ లను ప్రోత్సహిస్తున్నరని అన్నారు.
శ్రీసిటీ లో ఉన్న పరిశ్రమలకు, జిల్లాలోని ఇతర ప్రాంతాల పరిశ్రమలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని జిల్లా స్థాయిలో పరిష్కారానికి వీలైతే సత్వరమే చర్యలు చేపడతామని, ఈ సమావేశానికి సుమారు 120 కి పైన పరిశ్రమల ప్రతినిధులు హాజరవడం ఎంతో సంతోషించ దగిన విషయం అని, రాష్ట్ర స్థాయిలో పరిష్కారం అయ్యే అంశాలపై పరిష్కారానికి తప్పకుండా సమన్వయం చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ పరిశ్రమల ప్రతినిధులు రాయితీ నిధులు విడుదల గురించి కోరగా తొందర్లోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు. శ్రీసిటీ పరిధిలో పి.ఎఫ్ కార్యాలయం, ఈ ఎస్ ఐ ఆసుపత్రి ఏర్పాటు, రహదారుల విస్తరణ, మరమ్మత్తులపై, వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. తదుపరి జిల్లా పరిశ్రమల అభివృద్ధి సమావేశాన్ని శ్రీసిటీ లో ఏర్పాటు చేయమని కంపెనీల ప్రతినిధులు కోరగా తదుపరి సమావేశం శ్రీసిటీ లో ఏర్పాటు చేసి అందరు సంబంధిత అధికారులు హాజరవుతారని ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. కొంత మంది పరిశ్రమల ప్రతినిధులు మాట్లాడుతూ ఐ టి ఐ, డిప్లొమా అభ్యర్థులు తగినంత మంది లేరని తెలుపగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద ఎంతో మందికి వృత్తి నైపుణ్యం పెంపొందించి వారికి ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద పెద్ద ఎత్తున చేపట్టారని తెలిపారు.
ఎం.డి శ్రీసిటీ రవి సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీ లో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ తొందర్లోనే ప్రారంభం చేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో ఆర్డీఓ కిరణ్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ సూహాన సోనీ, సి పి ఓ అశోక్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ రామకృష్ణ, కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ నాగేశ్వర్ రావు, ఎఈ మదన మోహన్, రవాణా శాఖ తదితర అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News