-బెనిఫిట్ మెడికల్ బజార్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆరోగ్య భరోసాను కల్పిస్తూ కొనుగోలు ధరలకే మందుల విక్రయాలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విద్యాధరపురంలోని సితార ఎదురుగా నూతనంగా నిర్మించిన బెనిఫిట్ మెడికల్ బజార్ మందుల దుకాణాన్ని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు సొమవారం ఉదయం ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా ప్రారంభించారు. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న మందులు, ధరలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంతో పోటీ పడుతూ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఫార్మశీ రంగంలో రెండున్నర దశాబ్ధాల అనుభవం ఉన్న తాతా వెంకట సుబ్రహ్మణ్యం బెనిఫిట్ మెడికల్ బజార్‌ను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. మందుల విక్రయాలపై 20 నుంచి 80శాతం వరకు రాయితీ ఇవ్వడంతో పాటు కేవలం రూ.10కే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. బెనిఫిట్ మెడికల్ బజార్ అధినేత తాతా వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పడుతున్న వైద్య చికిత్స ఔషధాల ఖర్చులను గణనీయంగా తగ్గించేందుకు ఫార్మా రంగంలో తమకున్న 25సంవత్సరాల అనుభవాన్ని మేళవించి వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్, మొబైల్ యాప్స్ ద్వారా మందులను రాయితీ ధరలకే ఇవ్వడంతో పాటు డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖ సినీనటి నవీనా జాక్సన్ మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా సేవా దృక్పధంతో పేద ప్రజల అవసరార్థం 80శాతం రాయితీతో బెనిఫిట్ మెడికల్ బజార్‌ను అందుబాటులోకి తీసుకురావడాన్ని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో బెనిఫిట్ మెడికల్ బజార్ అభివృద్ధికి తాను ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పిస్తానని తెలిపారు. ప్రారంభోత్సవంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పలువురు నగర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను అభినందించారు.
Prajavartha Online Telugu News