గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని వార్డ్ సచివాలయాల్లో ఆధార్ సెంటర్స్ ఏర్పాటు చేశామని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం కమిషనర్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని 207 వార్డ్ సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ స్పెషల్ సెంటర్ ను అదనపు కమిషనర్ పి.రోజ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రజలకు ఆధార్ సేవల కోసం 9 వార్డ్ సచివాలయాల్లో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేశామని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సెంటర్లు పని చేస్తాయన్నారు. నూతన ఆధార్, ఈ.కె.వై.సి., ఆధార్ అప్ డేషన్, ఫోన్ నంబర్ లింక్, చిరునామా మార్పు వంటి సేవలను నిర్దేశిత రుసుంతో అందించడం జరుగుతుందన్నారు. నగరంలోని కొత్తపేట కుగ్లర్ హాస్పిటల్ రోడ్లో 32, లాంచెస్టర్ రోడ్ లోని 46, లాల్ పురం రోడ్ లోని 74, ఎన్.జి.ఓ.కాలనీ 95, కోబాల్ట్ పేట 123, అరండల్ పేట 143, పెద్ద పలకలూరు 172, బుడంపాడు 196, రెడ్డిపాలెం 204 వార్డ్ సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, మేనేజర్ శివన్నారాయణ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News