-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-23 వ డివిజన్ 98 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల లోగిళ్లలో నవరత్నాల పథకాలు కుల, మత, వర్గ భేదాలు లేకుండా సంక్షేమ వెలుగులు నింపాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శనివారం 23 వ డివిజన్ 98 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి ఆయన పాల్గొన్నారు. బీసెంట్ రోడ్డు, గూడవల్లి వారి వీధి, రాజగోపాలచారి వీధి, బైరెడ్డి రామన్న వీధి, చీరగుడి వారి వీధి, ప్రకాశం రోడ్డు, అలీబేగ్ వీధి, బందర్ రోడ్డు, మేరీ వీధులలో విస్తృతంగా పర్యటించి.. 212 ఇళ్లను సందర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్లుగా చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తమ ఇంటికి విచ్చేసిన ఎమ్మెల్యేని ప్రజలు సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. పలువురు పండితులు వేదాశ్వీచనం అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు, దుకాణదారులు, రోజువారీ కూలీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి సలహాలు, విలువైన సూచనలను స్వీకరించారు. సచివాలయానికి కేటాయించిన రూ. 20 లక్షల నిధులతో ఈ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
క్యాన్సర్ రహిత సమాజం ప్రతిఒక్కరి లక్ష్యం కావాలి
క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మల్లాది విష్ణు అన్నారు. ఈ మహమ్మారి పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి.. నివారణకు ప్రోత్సహించడమే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ద్వారా త్వరగా నిర్మూలించే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, పొగాకుకు దూరంగా ఉండటం, ఆల్కహాల్‌ను పరిమితం చేయడం వంటి చక్కని ఆరోగ్య సూత్రాలను పాటించడం ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్రొసీజర్లలో 400 ప్రొసీజర్లు ఒక్క క్యాన్సర్ కు సంబంధించినవి ఉన్నాయని.. రాష్ట్ర బడ్జెట్‌లో క్యాన్సర్ నివారణకు రూ.400 కోట్లను ఈ ప్రభుత్వం కేటాయించినట్లు చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాబోయే రోజుల్లో క్యాన్సర్ నివారణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని స్పష్టం చేశారు.
టీడీపీ కార్యాలయం ఒక అబద్ధాల ఫ్యాక్టరీ
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక అబద్ధాల ఫ్యాక్టరీ అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. గోబెల్స్ బాబు నేతృత్వంలో టీడీపీ ఆఫీస్ అబద్దాలను వండివార్చే కార్యాలయంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన సామాజిక వర్గాలలో చీలికలు తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు స్వర్ణ యుగం మొదలైందే 2019 నుంచి అని మల్లాది విష్ణు తెలిపారు. మైనార్టీలపై ప్రేమతో ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తే.. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారన్నారు. మైనార్టీ వర్గాల రాజకీయ సాధికారత కోసం ఐదుగురు ఉపముఖ్యమంత్రులలో ఒకరిని మైనార్టీ వర్గాల నుంచి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఉర్దూను రాష్ట్ర రెండో అధికార భాష హోదా కల్పించడంతో పాటు.. మూడున్నరేళ్ళలో మైనార్టీ సంక్షేమం కోసం రూ. 20,330.43 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. అలాగే మైనార్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్దత కల్పించడం జరిగిందన్నారు. మైనార్టీలను చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని.. మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించకుండా అవమానించి, కేవలం ఎన్నికల ముందు సవతి తల్లి ప్రేమ చూపించారని ఆరోపించారు. మరోవైపు జీవో నెం.1 అమలులో ఉన్నప్పుడు.. జాతీయ రహదారిపై బహిరంగ సభ పెట్టడానికి నారాలోకేష్ ఏవిధంగా పూనుకుంటారని మల్లాది విష్ణు ప్రశ్నించారు. చట్టాలు, రూల్స్ తమకు వర్తించవన్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ గూర్చి మాట్లాడే ముందు నారా లోకేష్ తన స్థాయి తెలుసుకోవాలని సూచించారు. పట్టుమని వంద మంది కూడా లేని పాదయాత్ర పబ్లిసిటీ కోసం ఇష్టారీతిన మాట్లాడితే ప్రజలే మరలా తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డీఈ రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు చల్లా సుధాకర్, వెన్నం రత్నారావు, పసుమర్తి రాజేష్, కొల్లిపర శ్రీను, వడ్డీ వాసు, యర్రంశెట్టి అంజిబాబు, అన్సారీ, చాందిని, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News