-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 12.88 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 23వ డివిజన్లోని మద్దులపల్లి వారి వీధిలో రూ. 7.89 లక్షల నిధులతో సీసీ రోడ్లు, భవానీ వారి వీధిలో రూ. 4.99 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రహదారుల నిర్మాణ పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజిన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావులతో కలిసి శనివారం ఆయన భూమిపూజ నిర్వహించారు. గవర్నర్ పేట ప్రాంత ప్రజల అవసరాలను తీర్చడంలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 ప్రధాన రహదారుల నిర్మాణాలు చేపట్టి ఈ ప్రాంత ముఖచిత్రమే మార్చివేసిందని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా వారి ఆకాంక్షల మేరకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. గత మూడున్నరేళ్లలో డివిజన్లలో రూ.15.39 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తోన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీ, నాయకులు చల్లా సుధాకర్, వెన్నం రత్నారావు, పసుమర్తి రాజేష్, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News