-బూత్ లెవల్ అధికారి పార్టీ ఏజెంట్ల సమన్వయంతో అనుసందాన ప్రక్రియ పూర్తి చేద్దాం..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ కార్డుకు ఆధార్ అనుసందాన ప్రక్రియ పూర్తి చేసేందుకు రాజకీయపార్టీల పాత్ర కీలకమని బూత్ లెవల్ అధికారి, రాజకీయపార్టీల ఏజెంట్ల సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేసేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు.
ఓటర్ కార్డుకు ఆధార్ అనుసందానం పై బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆయన కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఆధార్ సంఖ్యను లింక్ చేసేందుకు ఎన్నికల సంఘం ఫారం 6 బి ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 16 లక్షల 27 వేల మంది ఓటర్లకు ఆధార్ కార్డులను అనుసందానం చేయడం జరిగిందన్నారు. మరో 4 లక్షల మంది ఓటర్లకు ఆధార్ అనుసందాన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. మార్చి 2023 నాటికి పూర్తి స్థాయిలో ఆధార్ అనుసందాన ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంంఘం సూచించడం జరిగిందన్నారు. విజయవాడ నగర పరిధిలోని పశ్చిమ తూర్పు సెంట్రల్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు లక్ష చొప్పున మూడు లక్షల మంది ఓటర్లకు ఆధార్ అనుసందానం చేయవల్సి వుందని మిగిలిన నాలుగు నియోజకర్గంలో మరో లక్ష మంది ఓటర్లకు ఆధార్ అనుసందానం ప్రక్రియ పూర్తి చేయవలసి ఉందన్నారు. బూత్ స్థాయి అధికారులతో నెల రోజుల పాటు ఓటర్ అనుసందానంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నామని, రాజకీయపార్టీలకు చెందిన బూత్ ఏజెంట్లు ఆధార్ అనుసందానం ప్రక్రియకు సహకారం అందించేలా రాజకీయపార్టీలు కృషి చేయాలని కోరారు. బూత్ లెవల్ అధికారి రాజకీయపార్టీ ఏజెంటు ప్రతి ఇంటిని సందర్శించి ఆధార్ అనుసందానం కాని ఓటర్లను గుర్తించి ఆధార్ అనుసందానం చేసేలా చర్యలు తీసుకోవాలని తద్వారా పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అవకాశం వుంటుందన్నారు. అన్లైన్, ఆఫ్లైన్విధానాలలో ధరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఫారం 6 ఏ కు సంబంధించి ఎన్ఆర్ఐ ఓటర్ల నమోదు విషయంలో ఎటువంటి మార్పులు లేవని అన్నారు. ఎన్నికల సంఘం నిర్ధేశించిన విధంగా ఓటర్ల జాబితా సవరణలు, ఆధార్ అనుసందానం, 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లగా నమోదు అయ్యేందుకు నూతన మార్గనిర్దేశకాలపై అవగాహన ఏర్పచుకుని గుర్తుంపు పొందిన రాజకీయపార్టీలు, అధికారులు సమన్వయంతో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడానికి సహకరించాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు.
సమవేశంలో డిఆర్వో కె. మోహన్‌కుమార్, వైఎస్సార్ సిపి ప్రతినిధి వై. ఆంజనేయరెడ్డి, తెలుగుదేశపార్టీ ప్రతినిధి సిహెచ్ ఉషారాణి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బి. కిరణ్‌కుమార్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి సిహెచ్ కోటేశ్వరరావు, సిపియంపార్టీ ప్రతినిధి బి.వి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News