-వినూత్న కార్యక్రమంతో ప్రజల ముందుకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు గరిష్ఠస్థాయిలో సంక్షేమాన్ని అందించడం, అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించడంలో ప్రత్యేకతను చాటుకున్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. రచ్చబండ తరహాలో ‘మన సచివాలయం – మన ఎమ్మెల్యే’ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. సచివాలయ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, కన్వీనర్లు, వాలంటీర్లు, గృహసారథులతో సమావేశం కావడం.. పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ప్రతిఒక్క సచివాలయ ఉద్యోగి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం ముత్యాలంపాడులోని 211, 214 వ వార్డు సచివాలయాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. అనంతరం సచివాలయ సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు. వారి దైనందిన విధులు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రజా సమస్యల పరిష్కారం నిర్ణీత గడువులోగా జరగాలని ఆదేశించారు. సంక్షేమ క్యాలెండర్ పై ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు డివిజన్లో అభివృద్ధి పనులు కూడా వేగవంతం చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. శ్రీనగర్ కాలనీ, టీచర్స్ కాలనీలలో రూ. 61.84 లక్షల నిధులతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, యూజీడీ నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అలాగే జెండా చెట్టు వీధిలో రూ. 15.69 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఇటీవల శంకుస్థాపన చేసుకోగా.. పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికై మరింత ఉత్సాహంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట జోనల్ కమిషనర్ సృజనా, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం, అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News