Breaking News

“రైతు సాధికార సంస్థ కు ప్రతిష్ఠాత్మక మారికో ఇన్నొవేషన్ అవార్డు”

-ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి మరింత ఊతం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయాన్నిఅమలుచేస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న రైతు సాధికార సంస్థ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు సొంతమైంది. దేశంలో సామాజిక, ఆర్థిక, పర్యావరణ వ్యవస్థలపై అత్యంత ప్రభావం చూపే వ్యక్తులు , సంస్థలకు ప్రతి రెండేళ్లకోసారి “మారికో ఇన్నొవేషన్ఫౌండేషన్” వారు అందించే “మారికో ద్వైవార్షిక ఇండియా ఇన్నొవేషన్ 2023 ” అవార్డుకు సామాజిక విభాగంలో రైతు సాధికార సంస్థ ఎంపికైంది. ప్రకృతి వ్యవసాయాన్ని శరవేగంగా దేశ విదేశాల్లో విస్తరించేందుకు ఈ అవార్డు ఎంతగానో దోహదపడుతుంది. సరికొత్త టెక్నాలజీ తో వ్యవసాయ విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేదిశలో ప్రకృతి వ్యవసాయకార్యక్రమాన్ని అమలు చేస్తున్న కారణంగా “రైతు సాధికార సంస్థను” ఈ అవార్డ్ కు ఎంపిక చేసారు. రైతు సాధికార సంస్థ తరపున ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ శ్రీ విజయ్ కుమార్ముంబయి మహానగరంలోని జియో కన్వెన్సన్ సెంటర్ లో మార్చి 1 వ తేదీన జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డు ను అందుకొన్నారు. 2006 వ సంవత్సరం నుంచి “మారికో ఫార్చూన్ ఇండియా”అనుబంధ సంస్థయైన “మారికో ఇన్నొవేషన్ ఫౌండేషన్” ద్వారా ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 15 రంగాలకు చెందిన 60 ఆవిష్కరణలకు గుర్తింపు లభించింది. దేశంలో సరికొత్త ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించేందుకు మారికో సంస్థ 100 మంది మెంటార్ లతో కలిసి పనిచేస్తోంది. ప్రత్యేకత, ప్రభావం, విస్తరణ, సుస్థిరత కలిగిన ఆవిష్కరణలకు అవార్డు లను ప్రధానం చేస్తారు.

వ్యవసాయంలో జీవ ఉత్ప్రేరకాల వినియోగంతో టెక్నాలజీలో ప్రత్యేకతను కలిగి రైతుల జీవన ప్రమాణాలపై అత్యంత ప్రభావం చూపడమే గాకుండా లక్షలాది మంది రైతులకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరిస్తూ వ్యవసాయ విధానంలో సమూల మార్పులతో సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నకారణంగా రైతు సాధికార సంస్థకు ఈ అవార్డ్ సొంతమైంది.
రైతు సాధికార సంస్థ APCNF (Andhra Pradesh Community Managed Natural Farming – ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) ప్రాజెక్టు ద్వారా నేల ఆరోగ్యం, నీటి సంరక్షణ, జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడం, నీరు మరియు వాయు కాలుష్యాన్ని తగ్గించడం, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలను పునరుత్పత్తి చేయడం మొదలైన ప్రక్రియల ద్వారా భవిష్యత్తు తరాల ప్రయోజనాలను కాపాడే దిశగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో అమలవుతోన్న APCNF ప్రాజెక్ట్ఇదివరకే దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలను కూడా ఆకర్షిస్తోంది. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ఎంతో మంది ప్రతినిధులు ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. ప్రభావితమవుతున్నారు.

APCNF ప్రాజెక్టు కింద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 3730 గ్రామ పంచాయతీల్లో 6.30 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలకు ప్రాజెక్టును విస్తరించి 50 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా ఎంచుకొంది. ఋతుపవనాలకు ముందే విత్తనం వేసి కరవుపీడిత ప్రాంతాల్లో కూడా 365 రోజులు పంటలు పండేలా ప్రకృతి వ్యవసాయం ద్వారా నూతన వ్యవసాయ విధానాలను ఆచరిస్తున్నారు. బీడుభూముల్లో కూడా 30 రకాల పంటలు వేసి ఏడాది పొడవునా పంట పొలాల్లో పచ్చదనం కనిపించేలా చేస్తున్నారు. తొమ్మిది సూత్రాల ఆధారంగా ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తూ ప్రభుత్వాలు ఎరువులపై భారీగా అందిస్తున్న సబ్సిడీల అవసరం లేకుండా చేసి సమాజానికి సురక్షితమైన రసాయన రహిత ఆరోగ్యకర ఆహారాన్ని అందించాలని రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది. రైతుల నికర ఆదాయాన్ని పెంపొందిస్తూ వ్యవసాయ కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో అమలుచేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశ్యంతో రైతు సాధికార సంస్థఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ శ్రీ విజయ్ కుమార్ ను జాతీయ స్థాయిలో వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సలహా మండలిలో సభ్యులుగా నియమించారు. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా సమర్థవంతంగా అమలు చేసేందుకు జర్మన్ ప్రభుత్వ ఆర్థిక సహకారంతో (20 మిలియన్ యూరోస్) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందులలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో IGGAARL (ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్) సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడమైనది. ఇటీవలనే రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం కోసం “కో ఇంపాక్ట్” సంస్థ 15 మిలియన్ యూ ఎస్ డాలర్ లు రైతు సాధికార సంస్థకు గ్రాంట్ రూపంలో అందజేసింది.

అవార్డు వల్ల కలిగే ప్రయోజనాలు
ఈ అవార్డు ను సొంతం చేసుకొన్న సంస్థలకు సహజంగా 5 రకాల ప్రయోజనాలు కలుగుతాయి . అందులో భాగంగా
1. ఫౌండేషన్ వారు రైతు సాధికార సంస్థకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చి ప్రకృతి వ్యవసాయ విధానాలను అదే సారూప్యంలో పనిచేసే సంస్థల దృష్టికి తీసుకువెళ్తారు.
2. ఇదే నేపథ్యంలో సుస్థిర వ్యవసాయం కోసం కృషి చేస్తున్న వివిధ సంస్థలతో సంబంధాలను ఏర్పాటుచేస్తారు
3. రైతు సాధికార సంస్థకు మరియు ప్రకృతి వ్యవసాయ విధానాలకు దేశంలో బాగా పేరుగాంచిన సమాచార ప్రసార మాద్యమాల ద్వారా, ఫౌండేషన్ వారి సొంత చానెల్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించి మరింత గుర్తింపు వచ్చేలా చేస్తారు
4. ప్రకృతి వ్యవసాయ విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు దోహదపడేలా నాయకత్వ లక్షణాలపై మంచి నైపుణ్యం కలిగిన సంస్థలు, వ్యక్తులతో శిక్షణ కల్పించి మరిన్ని నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తారు.
5. ప్రకృతి వ్యవసాయ ఫలితాల ప్రభావాన్ని అత్యంత వేగవంతంగా అత్యధిక స్థాయిలో విస్తరించేందుకు ఫౌండేషన్ సహాయ సహకారాలు అందిస్తుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *