-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన మనస్సుతో విద్యపై దృష్టి పెట్టి ఉత్తమ ఫలితాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు.
నగరంలోని 52వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేట నందు గల కేర్ అండ్ షేర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి విద్య బోధనపై విద్యార్థులతో ముచ్చటించారు. పదవ తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలను రాబట్టారు. తరగతి గదిలో బ్లాక్ బోర్డు పై గణితానికి సంబంధించి ట్రిగ్నోమీటర్ డయాగ్రమును కలెక్టర్ స్వయంగా వ్రాసి విద్యార్థులను జవాబులడిగారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠ్యాంశాలపై విద్యార్థులకు చదవడం, వ్రాయడం లో మంచి ప్రావీణ్యత పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు భాష బోధనలో మార్పులు తీసుకువచ్చి పటిష్టమైన బోధన అందించాలన్నారు. విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో బోధన ఉండాలన్నారు. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన మనస్సు ఏకాగ్రతలతో చదువుపై దృష్టి పెట్టినప్పుడు మంచి ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నెల రోజుల్లో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని పరీక్షలను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులు సబ్జెక్టును భోదించే సమయంలో విద్యార్థులు ఏకాగ్రతతో వింటే పాఠ్యాంశాన్ని సులువుగా అర్ధం చేసుకొని పరీక్షలలో ప్రశ్నకు సరైన సమాధానం వ్రాయగలుగుతారన్నారు.
విద్యార్థులకు పౌష్ఠికాహార విలువలతో మధ్యాహన భోజనన్ని అందించండి:
పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మధ్యాహన భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పౌష్ఠిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వయంగా మధ్యాహన భోజన పధకానికి సంబంధించి మెను ను రూపొంచారన్నారు. మెను లో సూచనలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్ఠిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు. ముఖ్యంగా బాలికలతో రక్తహీనతను నివారించేందుకు పంపిణి చేస్తున్న ఐరన్ ట్యాబ్లేటాను విద్యార్థినిలు సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
నాడు నేడు పనులను త్వరితగతిన పూర్తిచేయండి:
ప్రభుత్వం విద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చి పాఠశాలల్లో అధునాతనమైన మౌలిక వసతులను కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నాడు నేడు ద్వారా అదనపు గదులు, కిచెన్ షెడ్ లు, టాయిలెట్ లు కాంపౌండ్ వాల్ నిర్మాణం, రక్షిత మంచి నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, గ్రీన్ చాక్ బోర్డు, ఇంగ్లీష్ ల్యాబ్ ల వంటి అధునాతన సౌకర్యాలను కల్పించేందుకు కోట్లాది రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నాడు నేడు పనులను త్వరితగతిన పూర్తీ చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకురావడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
పాఠశాల తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట విజయవాడ ఉత్తర మండల తహశీల్ధార్ దుర్గ ప్రసాద్, ఆర్ ఐ. అనిల్, వీఆర్వోలు మోహన్, కమల్, ప్రధానోపాధ్యాయులు ఎమ్. శ్రీనివాసరావు, అధ్యాపకులు వి. శివాజి, ఎస్.బి. వరలక్ష్మి, వి. నాగరాజు, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News