– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-డిప్యూటీ మేయర్ తో కలిసి రూ. 40.54 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 58వ డివిజన్ భరతమాత కాలనీలో రూ. 40.54 లక్షల వ్యయంతో రోడ్లు, త్రాగునీటి పైపులైన్ పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి మంగళవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో గత చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం పోతుపోతూ పెద్దఎత్తున సమస్యలు వదిలివెళ్లిందని.. వాటన్నింటినీ సవాలుగా తీసుకుని ప్రతి ఒక్క ప్రాంతాన్ని ఈ ప్రభుత్వం అభివృద్ధి పరుస్తున్నట్లు వెల్లడించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు మెరుగుపరిచేందుకు విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత మూడున్నరేళ్లలో డివిజన్ అభివృద్ధికి రూ. 22 కోట్ల నిధులు కేటాయించి.. ఖర్చు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలనీలన్నీ క్రమక్రమంగా ప్రగతి పథంలో పయనిస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో విజయవాడను మరింత సుందరంగా తీర్చిదిద్ది భావితరాలకు అద్భుతమైన నగరాన్ని అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఈ ప్రాంతంలో పెనుమార్పు వచ్చిందని తెలిపారు. రిక్షాలు కూడా సంచరించలేని రోడ్లను కార్లు సైతం ప్రయాణించేలా అభివృద్ధి పరిచి.. సెంట్రల్ ను అభివృద్ధిలో మేటిగా నిలిపిన ఘనత ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే దక్కుతుందన్నారు. ఉనికిని కాపాడుకునేందుకు ప్రతిపక్షాలు పైకి విమర్శలు చేస్తున్నా.. జరుగుతున్న అభివృద్ధిని చూసి లోలోపల కుళ్లుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఇసరపు దేవీ రాజారమేష్, కొంగితల లక్ష్మీపతి, నాయకులు అఫ్రోజ్, తోపుల వరలక్ష్మి, కాళ్ల ఆదినారాయణ, నేరెళ్ల శివ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News