Breaking News

వివక్ష లేని సమాజం కోసం, మహిళలను గౌరవించే వ్యవస్థ కోసం కలిసి పని చేద్దాం !!

-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వివక్ష లేని సమాజం కోసం, మహిళలను గౌరవించే వ్యవస్థ కోసం, మహిళలు ఎదగడానికి అవకాశం ఇచ్చే పరిస్థితుల కోసం కలిసి పనిచేద్దామని కృష్ణా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పిలుపునిచ్చారు.
గురువారం మధ్యాహ్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సులో వివిధ రంగాల్లో ప్రతిభను, ఆధిక్యతను,
సాధికారతను సాధించిన మహిళ మణులను గౌరవించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ, సమాజంలో పురుషుల కన్నా శక్తి సామర్థ్యాలు, కుశాగ్ర బుద్ధితో యోచించే శక్తి మహిళలకే అధికంగా ఉన్నందున సమాజాన్ని తీర్చిదిద్దే విషయంలో మహిళలు అనేక కీలక రంగాల్లో ముందుంటున్నారని ప్రశంసించారు. ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అని, బాలికలు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం బాలికలు అన్ని రంగాల్లో బాలురతో సమానంగా అభివృద్ధి సాధిస్తున్నారని అన్నారు. వారి పట్ల తల్లిదండ్రులు ప్రేమాభిమానాలు చూపి ప్రోత్సాహం అత్యధికంగా అందించాలన్నారు. ఇటీవల ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ కప్పుకు మన దేశ మహిళలు ఎంపికై తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపుతున్నారన్నారు అలాగే ప్రస్తుతం దేశ సైన్యంలో యువతులు యుద్ధ విమానాలు నడుపుతున్నారని, సివిల్స్, నిట్, ఐఐటి తదితర ఉన్నత విద్యలో అత్యున్నతమైన ర్యాంకులు ఆడపిల్లలు సాధిస్తున్నారని ఇది ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు
తొలిత ప్రసంగించిన జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ, పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. మహిళా దినోత్సవం రోజున మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజు మహిళల పట్ల విధేయత చూపాలని కోరారు. ఒక్కరోజు మాత్రమే మహిళా దినోత్సవం కాదని ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవమేనని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రస్తుత కాలంలో ప్రతీ రంగంలోకి మహిళలు అడుగిడుతురన్నారు. ప్రతీ ఒక్కరూ అన్ని రంగాల్లో విశేషంగా రాణించాలన్నారు. ఒకరిపై ఆధారపడకుండా మహిళలు తమ సమస్యలు తామే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.తమ కూతుళ్ళకు కొడుకులతో సమానంగా ఉన్నత విద్యను అందిస్తే పురుషులతో సమానంగా ఎదగగలరని చెప్పారు. మహిళలు అన్నిరంగాల్లో సాధికారత సాధించినప్పుడే అటు గ్రామ ప్రగతితో పాటు దేశ ప్రగతి సాధ్యమన్నారు. మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను, ప్రపంచంలో మహిళలు సాధించిన విజయాలను వివరించారు. మహిళలు సమాజంలో సగ భాగమని, ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో ముఖ్యంగా రాజకీయాల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహిస్తోందని అన్నారు మహిళా సాధికారికత సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల అండతో మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని ఉద్బోధించారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు దిశగా త్వరలోనే ముందడుగు పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజ్యంగం అందించిన హక్కులతో పాటు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, కార్యక్రమాల సహకారంతో మహిళలు రాజకీయ, ఆర్ధిక, సామాజిక, పాలన రంగాల్లో రాణించేందుకు ప్రయత్నించాలన్నారు.
తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ ప్రసంగిస్తూ, ఆర్థిక స్వేచ్ఛ స్వావలంబన కోసం ప్రతి మహిళ కృషి చేయాలన్నారు. విద్య, ఆర్థిక స్వాతంత్ర్యం మీ గుప్పిట్లో ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా మహోన్నతంగా రాణించవచ్చన్నారు. ఇంటి పని, వంట చేసే పని కేవలం ఆడపిల్లల పనిగా పొరబాటున అభివర్ణించరాదని, మగ పిల్లలకు సైతం ఆ పనులను తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే నేర్పించాలన్నారు. విజయం సాధించిన ప్రతి మహిళ వెనక కచ్చితంగా మరో శ్రీ మూర్తి ఉంటారని, ఆడపిల్లకు సమాన హక్కులు ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలని జాయింట్ కలెక్టర్ సందేశం ఇచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల జరిగిన కబడ్డి, ఖోఖో, బాల్ బ్యాట్మెంటన్, టెన్నికాయిట్, పరుగు పందెం క్రీడల పోటీల్లో విన్నర్స్ రన్నర్స్ కు బహుమతులు అందజేశారు. వివిధ శాఖల జిల్లా మహిళాధికారులు, సన్మాన గ్రహితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక జవహర్ పబ్లిక్ స్కూల్ బాలికలు ‘ మగువా..ఓ మగువా.. లోకానికి తెలుసా నీ విలువ ?
మీ సహనానికి సరిహద్దు కలవా ? అంటూ ప్రదర్శించిన నృత్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవితా, ముడా చైర్ పర్సన్ బొర్రా నాగ దుర్గ భవాని, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఎ, మెప్మా పి డి. పి.ఎస్ ప్రసాద్, ఐసిడిఎస్ పిడి సువర్ణ, ముడా వీసి రాజ్యలక్ష్మి, డి సి పి ఓ జాన్సన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *