Breaking News

ప్రజా సమస్యలు వంద శాతం పరిష్కారమే లక్ష్యం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-57 వ డివిజన్ 233 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యల్ని నూరు శాతం పరిష్కరించడమే లక్ష్యమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం 57 వ డివిజన్ 233 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవీ రాజారమేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. న్యూ ఆర్.ఆర్.పేటలో విస్తృతంగా పర్యటించి.. 240 గడపలను సందర్శించారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలన అహంభావంతో., సామాన్య, పేద కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసేలా సాగిందని మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ సీఎం జగన్ పాలనలో తామంతా సగర్వంగా జీవించగలమని, పిల్లలను ఉన్నతంగా చదివించగలమనే నమ్మకం పేదలలో బలంగా ఏర్పడిందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆర్.ఆర్.పేటలో 2,813 మందికి, వాంబేకాలనీలో 3,500 మంది పేదలకు నామమాత్రపు రుసుము గజానికి కేవలం రూ. 100 కే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కలిగిందన్నారు. ఇందుకోసం త్వరలో ఒక నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకునే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.

పేదలకు కొండంత భరోసా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యంలో ప్రతిఒక్క కుటుంబానికి మంచి జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ పరిధిలో రూ.3.72 కోట్ల సంక్షేమాన్ని అర్హులకు అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారు మీసాల జగన్నాథం మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం వర్తించినట్లు చెప్పారు. అన్నదాతల ఆర్థిక ప్రగతికి ఈ ప్రభుత్వం అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తోందని కొనియాడారు. తుమ్ము లక్ష్మి మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, చేయూత, ఆరోగ్య ఆసరా, పింఛన్ కానుక వర్తించినట్లు చెప్పారు. వేల్పుల వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో పింఛన్ అందుకునేందుకు ఇబ్బంది పడని మాసం లేదని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటి వద్దకే వాలంటీర్ తీసుకొచ్చి అందిస్తున్నట్లు తెలిపారు. మరో లబ్ధిదారు సముద్రపు రావయమ్మ మాట్లాడుతూ.. జగనన్న వసతిదీవెన, వైఎస్సార్ ఆసరా, జగనన్న విద్యాదీవెన, పింఛన్ వస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మేలుకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేశారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై లోకేష్ సమాధానం చెప్పాలి
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, కుంభకోణాలు అన్నీఇన్నీ కావని మల్లాది విష్ణు విమర్శించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్, ఈఎస్ఐ కుంభకోణం, టిడ్కో ఇళ్ల అవినీతి.. ఇలా వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముసుగులో జరిగిన భారీ అవకతవకలను కాగ్ నిగ్గుతేల్చిందని తెలిపారు. వాస్తవానికి ప్రాజెక్టు విలువలో 10 శాతం నిధులు ప్రభుత్వం కేటాయించాల్సి ఉండగా.. రూ. 370 కోట్ల ప్రాజెక్టు అంచనాలను రూ.3,300 కోట్లకు పెంచి ఏకంగా రూ. 370 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు. పైగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం చేసుకున్నామని చెబుతున్న ఒప్పందంలో సంబంధిత కాలేజీలను భాగస్వాములను చేయనేలేదని ఆరోపించారు. ముందుగా వీటన్నింటిపై యువతకి సమాధానం చెప్పి.. ఆ తర్వాత నారా లోకేష్ తన యాత్రను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు యువగళం పేరుతో పాదయాత్ర చేసే నైతిక అర్హత టీడీపీ నేతలకు ఏమాత్రం లేదని మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, డివిజన్ కోఆర్డినేటర్ కాళ్ల ఆదినారాయణ, నాయకులు చెన్నకేశవరెడ్డి, చెన్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి, గోవింద్, ప్రేమ్ కుమార్, ఎన్.ఎస్.ఆర్, చిట్టెమ్మ, రజియా, మురళి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *