-వైఎస్సార్ ఆసరా మూడో విడత సంబరాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల అభ్యున్నతే సమాజ ప్రగతికి కొలమానమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అయోధ్యనగర్లో శనివారం జరిగిన వైఎస్సార్ ఆసరా మూడో విడత సంబరాలలో కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, వైసీపీ డివిజన్ ఇంచార్జి గుండె సుందర్ పాల్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల ఆనందమే ధ్యేయంగా సీఎం జగనన్న సుపరిపాలన అందిస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సాధికారతలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిందని తెలిపారు. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్ సంపూర్ణ పోషణ తదితర సంక్షేమ పథకాలతో కడుపులోని శిశువు నుంచి పండు ముదుసలి వరకు అందరికీ అండగా నిలుస్తున్న ప్రభుత్వం దేశంలో జగనన్న సర్కారు మాత్రమేనని చెప్పుకొచ్చారు. అలాగే ఆడపడుచులు ఆర్థిక లబ్ధి అందించేందుకు, డ్వాక్రా సంఘాలు పునరుజ్జీవం పొందేందుకు మూడు విడతలలో ఇచ్చిన మాట ప్రకారం సంబంధిత గ్రూపు రుణాలను తమ ప్రభుత్వం తీర్చిందని చెప్పారు. మరో విడతలో రుణాల చెల్లింపు పూర్తి అవుతుందని వెల్లడించారు. 32 డివిజన్ కు సంబంధించి మూడవ విడత ఆసరా ద్వారా 83 గ్రూపులలో రూ. 64 లక్షల 84 వేల 165 రూపాయల నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలని సూచించారు. అలాగే బహుళ జాతి సంస్థలతో ఒప్పందాల ద్వారా వ్యాపార మార్గాలు చూపించి.. ఆడపడుచుల సుస్థిర ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తునట్లు తెలియజేశారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలకు మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పీఓ యూసీడీ శకుంతల, సీడీఓ జగదీశ్వరి, నాయకులు సువర్ణ రాజు, ఆదిరెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వరరెడ్డి, మాల్యాద్రి, వెలగ సురేష్, రాబర్ట్, పొదుపు సంఘాల మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News