– హోం మంత్రి తానేటి వనిత ఆదేశాలతో ఆత్మహత్యల నివారణా చర్యలు
– రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై కొవ్వూరులో ఔట్ పోస్టు ఏర్పాటు
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనితలోని అమ్మ మనసును ఒక ఘటన కలచివేసింది. వెంటనే ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లడంతో అధికార యంత్రాంగం అమ్మ మనసుకు బాసటగా నిలిచింది. దీని సత్ఫలితంగా రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకి ఆత్మహత్యలు చేసుకునే వారిని నివారించడానికి, బాదితులకు తక్షణ సహాయం అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ చర్యలు తీసుకుంది. దీనికోసం రోడ్ కం రైల్వే బ్రిడ్జి వద్ద కొవ్వూరులో తాత్కాలిక ఔట్ పోస్టును ఏర్పాటు చేసింది. రెస్కూ టీం నిరంతరం అన్ని సమయాల్లో ఈ ఔట్ పోస్టు వద్ద గస్తీ కాస్తున్నారు.
మూడు రోజుల క్రితం (ఆదివారం) రాష్ట్ర హోంమంత్రి రాజమండ్రి పర్యటనను ముగించుకుని కొవ్వూరు క్యాంపు కార్యాలయం వస్తుండగా రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీద జనం ఎక్కువగా గుమిగూడి ఉండటం పరిశీలించారు. దీంతో హోం మంత్రి కాన్వాయ్ ను పక్కకు ఆపి.. ఏమైందని ఆరా తీశారు. అంతకు 5 నిమిషాల క్రితమే బ్రిడ్జి మీద నుండి ఒక వ్యక్తి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రయాణికులు మంత్రికి వివరించారు. వెంటనే మంత్రి స్పందించి… పోలీసు శాఖ వారికి, అగ్నిమాపక సేవల వారికి ఆ వ్యక్తిని కాపాడాలని ఆదేశించారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ వ్యక్తిని కాపాడలేకపోయామని, ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు మంత్రికి సమాచారం ఇవ్వడంతో ఆమె మనసు కలిచివేసింది. ఒక మనిషి క్షణికావేశ నిర్ణయంతో కళ్లెదుట ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా.. ఏమీ చేయలేకపోతున్నామనే బాధ వెంటాడింది. ప్రజా ప్రతినిధిగా ఉన్నాం.. హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా ఉన్నాం.. ఏదైనా చేయాలనే ఆలోచనలు మెదిలాయి. ఆ తర్వాత రోజున వెలగపూడి సచివాలయం వెళ్లినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి.. వెంటనే రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి మీద ప్రమాదాలను అరికట్టడానికి ఔట్ పోస్టును ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆత్మహత్యల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. హోంమంత్రి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రాణం చాలా విలువైనదని, క్షణికావేశంలో ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మంత్రి తానేటి వనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొన్ని సందర్భాలలో గోదావరిలో దూకిన వ్యక్తుల బాడీలు కూడా దొరకకపోవడం, గుర్తించలేకుండా ఉండటం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. తాజా నిర్ణయంతో ఇలాంటి ఘటనలు జరగకుండా అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. 24 గంటలు గస్తీ కాచే రెస్కూ టీంలో ఒక డ్రైవర్ కమ్ ఫైర్ మెన్, ఒక ఫైర్ మెన్, కొవ్వూరు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఉంటారని తెలిపారు. ఆపత్కాలంలో ప్రాణాలను కాపాడడానికి వీలుగా రోప్ లు, లైఫ్ బాయిస్ (ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడే విధంగా గుండ్రంగా ఉండి నీటిలో తేలియాడుతుంది), లైఫ్ జాకెట్స్ అందుబాటులో ఉంటాయన్నారు. మిస్ట్ (MIST) వాహనంలో ఎప్పటికప్పుడు రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జికి ఇరువైపులా పెట్రోలింగ్ చేస్తారని ఆమె తెలిపారు. అందరికీ మంచి జరగాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలందరూ సంతోషంగా జీవితం గడపాలని హోం మంత్రి తానేటి వనిత ఆశించారు.
Prajavartha Online Telugu News