విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక హోదా విభజన హామీల సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణ పై అదివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష జేఎసీ సమావేశం జరిగింది. ఇందులో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని జేఏసీ అధ్యక్షుడిగా సినీ నటుడు రాంకీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాంకీ మాట్లాడుతూ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను అన్ని పార్టీలు విస్మరించాయన్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రానికి వివరించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయ పార్టీలు… స్వార్థ ప్రయోజనాల కోసం నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్య తీరాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకుడు ఫణి రాజ్ మాట్లాడుతూ… అఖిలపక్షం జేఏసీ సమావేశం ద్వారా ప్రత్యేక హోదా విభజన హామీలను సాధించేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరిని కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. గడపగడపకు వస్తున్న నాయకులను రాష్ట్రానికి ప్రత్యేక హెూదా ఎందుకు రాలేదని నిలదీయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హెూదా వచ్చేవరకు ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుందన్నారు. అమరావతి జేఏసీ నాయకుడు పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ… ప్రత్యేక హోదాపై మోదీతో మాట్లాడి ఇప్పిస్తానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారని, ఎంపీలను ఇస్తే హెూదా తీసుకువస్తానని జగన్ హామీ ఇచ్చారన్నారు. ఇద్దరూ హోదా తీసుకురాకుండా ప్రజలను మోసం చేశారన్నారు. అఖరికి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందన్నారు. 135 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టమని ఎవరు అడిగారు? ఇంటింటికి స్టిక్కర్లు ఎందుకు వేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపకులు దశరథ రామిరెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహర శెట్టి నరసింహారావు, రాజ శ్రీనివాసరావు, ఐక్యకాపు సంఘ నాయకులు బెతు రామ్మోహన్, ఎన్ టిఆర్ జిల్లా ఎఐఎస్ఎఫ్ సాయికుమార్, టీడీపీ ఎస్సీ నాయకులు పరిశిపోగు రాజేష్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి
-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …
Prajavartha Online Telugu News