* అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎండల సమయంలో బయటకు రావద్దు
* ఉపాధి హామీ పనులను నిర్ణీత సమయంలో చేపట్టాల్సి ఉంది
* అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు నివారణ చర్యలు తప్పనిసరి
రాజమహేంద్రవరం నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న 15 -20 రోజులలో వేసవిలో ఎండ తీవ్రత హెచ్చరికల ను దృష్టిలో ఉంచుకొని వృద్దులు, చిన్న పిల్లలు ఎండ సమయంలో బయటకు రావద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావలిసి వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లాలో కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వేసవి లో తీసుకోవలసి పలు జాగ్రత్తల పై శాఖల వారిగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ గత వారం రోజులుగా అకాల వర్షాలు పడుతున్నప్పటికీ, రానున్న 15 నుంచి 20 రోజులు తీవ్రమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు వారి శాఖల ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్ ఆర్ ఈ జి ఎస్ ఉపాధి హామీ కూలీల పని వేళలు మార్పు చెయ్యాలన్నారు. ఆ మేరకు సమయ పాలన విషయంలో క్షేత్ర స్థాయి సిబ్బంది ద్వారా తొందరగా పని ప్రారంభించి, పూర్తి చెయ్యడం తో పాటు పర్యవేక్షణ అవసరమని స్పష్టం చేశారు. త్రాగునీటి సదుపాయం, అత్యవసర మందులు, మెడికల్ ఏయిడ్ కిట్స్, షెల్టర్, అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వారీగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వాటి వివరాలను ఎప్పటి కప్పుడు నవీకరించడం ద్వారా అవసరమైన మేరకు స్టాక్ సిద్దం చేసుకోవాలని వైద్య అధికారులకు జేసీ సూచించారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత దృష్ట్యా అగ్ని ప్రమాదాలు సంభవించేందుకు అవకాశలు ఉన్నందున జిల్లా అగ్ని మాపక కేంద్ర అధికారి ఆధ్వర్యంలో ఎలార్ట్ సిస్టం సిద్దం చేసుకొని, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలతో సిద్దంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ అన్నారు. అగ్నిమాపాక వాహనాలు పూర్తిస్తాయిలో వినియోగంలో ఉండేలా పెండింగ్ మరమ్మత్తులు పూర్తి చేసి, తగిన నీటి వనరులు ఉండేలా చూడాలన్నారు. జిల్లా పౌర సరఫరా ల అధికారులు అగ్ని ప్రమాదాల ముందస్తు నివారణకు పెట్రోల్ బంకులు, రేషన్ షాప్స్ వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. తనిఖీలు నిర్వహించి అగ్ని ప్రమాద నివారణ యంత్ర పరికరములు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆయా యాజమాన్యాలు నీటి వసతి ఏర్పాటు చేసుకొనే విధంగా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. వివిధ శాఖల సమన్వయంతో జనసంచారం గల ప్రదేశాలలో, కూడళ్ళలోచలి వేంద్రాలు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయాలని, అవసరమైన మేరకు స్వచ్ఛంద సంస్థలు, ఏజెన్సీలు ద్వారా పట్టణ , గ్రామీణ ప్రాంత ప్రజలకు చలి వేంద్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎండల సమయంలో బయటకు తిరగరాదని, బయట తిరిగే సమయాల్లో వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవడం తో పాటు వేసవి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Prajavartha Online Telugu News