Breaking News

స్పందనతో పాటు ‘ జగనన్నకు చెబుదాం ‘ పేరుతో మరో కొత్త వ్యవస్ధ… : జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు మరింత మెరుగ్గా పరిష్కారం చూపించేందుకు వీలుగా ఇప్పటికే ఉన్న స్పందనతో పాటు జగనన్నకు చెబుదాం పేరుతో మరో కొత్త వ్యవస్ధను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశం మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, ఎక్కడైనా, ఏ సమస్య కైనా ప్రయత్నం చేసినా పని జరగని పరిస్దితి ఉంటే వాటికి పరిష్కారం చూపేందుకు ఈ కార్యక్రమంను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ఇదో మంచి వేదిక అవుతుందన్నారు. ఎక్కడా పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించుకునేందుకు అర్జీదారులు నేరుగా 1902 కు ఫోన్ చేయాలని సూచించారు. వివక్షకు తావులేని వ్యవస్ధ తీసుకురావాలని ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేసిందన్నారు. అందులో భాగంగానే స్పందన కార్యక్రమం అమలు చేశామన్నారు. స్పందన కంటే మెరుగ్గా ఉండేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభమైనట్లు కలెక్టర్ తెలిపారు. తొలుత గ్రామ/ వార్డు సచివాలయాలు, మండల, డివిజన్, జిల్లాస్థాయిలో అర్జీలు నమోదు చేసుకునే అవకాశం ఇప్పటికే ఉందన్నారు. అపెక్స్ కమిటీ, జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయని ఇప్పుడు స్పందనను ‘జగనన్నకు చెబుతాం” జే కే సి ప్రోగ్రాం కింద పరిష్కార నాణ్యతను మెరుగుపరచడానికి రూపొందించబడిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంను ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఐఏఎస్ అధికారులను నియమించింది అన్నారు. హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పి. లక్ష్మిషా కృష్ణా జిల్లాకు ప్రభుత్వం నియమించినట్లు ఆయన తెలిపారు.
సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగతంగా ఎవరికైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం మొదలైందని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక లేదా రేషన్‌ కార్డు పొందడం వంటి విషయాల్లో ఏవైన ఇబ్బందులు ఎదురైనా లేదా ప్రభుత్వ పథకాలు అందుకోవడంతో ఏవైన సమస్యలు ఉన్న టోల్‌ఫ్రీ నంబరు 1902కు ఫోను చేయవచ్చు. అంతేకాదు రెవెన్యూ సమస్యలు లేదా ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమస్యలను కూడా తెలియజేయవచ్చన్నారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ /వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినికల్ తదితర కార్యాలయాల పనితీరును పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులు నెలలో రెండుసార్లు జిల్లాను సందర్శిస్తారన్నారు. కృష్ణాజిల్లాకు అపెక్స్ కమిటీలో రెవిన్యూ తరుపున కలెక్టర్ గా తాను, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో సభ్యులుగా ఉంటామని, అలాగే పోలీస్ వ్యవహారాలకు సంబంధించి ఎస్పీ (సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) ఉంటారని తెలిపారు. మండల స్థాయిలో ప్రతి సోమవారం, డివిజన్ స్థాయిలో ప్రతి గురువారం, జిల్లా స్థాయి ప్రతి శుక్రవారం, అపెక్స్ స్థాయి సమావేశం ప్రతి సోమవారం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారంటే టోల్‌ ఫ్రీ నంబర్ 1902కు ఫోన్‌ చేసి కాల్‌ సెంటర్‌లోని ప్రతినిధికి తమ సమస్యను చెబితే వారు దానిని రాసుకొని ఒక నంబరు (యువర్‌ సర్వీసు రిక్వెస్టు ఐడీ ..వైఎస్సార్‌ ఐడీ) ఇస్తారన్నారు. ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారానికి ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయాలు ఫిర్యాదుదారుడికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారని చెప్పారు. అలాగే అర్జీ దారిని సంతృప్తి స్థాయి పరిగణలో తీసుకుంటామని తెలిపారు. సమస్య పరిష్కరించిన తర్వాత వారు తమ అభిప్రాయం తెలియజేయాల్సి ఉంటుందని అయితే ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారాన్ని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తారని వివరించారు.
ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో పలువురు అర్జీదారులు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వస్తుంటారని తాను వారికి మీడియా ద్వారా ఒక విన్నపం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్జీదారుడు తొలుత సచివాలయం, తహసిల్దార్, ఆర్డీవో, డివిజన్ స్థాయి అధికారుల వద్దకు సంబంధిత సమస్య పరిష్కారానికి వెళ్లాలని సూచించారు. అత్యధిక శాతం మంది ప్రజలు నేరుగా తన వద్దకు రావడం వలన, సమస్య ఎందుకు పరిష్కారం కాలేదని స్థానిక అధికారులను అడిగినప్పుడు తమకు ఆ సమస్యపై అవగాహన లేదని పలు సందర్భాల్లో అంటున్నారని కలెక్టర్ తెలిపారు. కనుక అర్జీదారులు తమ పరిధిలోని అధికారులకు తొలుత సంబంధిత సమస్యను తెలియజేయాలని కలెక్టర్ పి రాజాబాబు సూచించారు. ఈనెల 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించేందుకు మచిలీపట్నం వస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు
అనంతరం జిల్లా ఎస్పీ పి. జాషువా మాట్లాడుతూ, జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సంబంధించి పోలీస్ సంబంధిత కేసులలో ఒక రోజు నుంచి వారం రోజుల వ్యవధిలో పరిష్కారం చూపించాల్సి ఉందన్నారు. ముందుగా ఫిర్యాదారులు తమ పరిధిలో గల పోలీస్ స్టేషన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ , డి.ఎస్.పి పరిధి తర్వాత తన వద్దకు సంబంధిత కేసు రావాలన్నారు. దీనిని పర్సుయింగ్ అండ్ మానిటరింగ్ యూనిట్ ( పి ఎం యు ) అంటారని తెలిపారు. ఒక పౌరుడు ఏదైనా సమస్యతో జగనన్నకు చెబుదాం పోర్టల్ ను సందర్శిస్తే కేవలం ఒక్క గంటలో సంబంధిత స్టేషన్ ఆఫీసర్ కు అర్జీదారిని సమస్యను తెలియచేసి ఆ సమస్యను వెంటనే పరిశీలించి చట్టపరమైన పరిష్కారాన్ని 24 గంటల్లోపు అన్వేషించాలని సూచిస్తామన్నారు. అలాగే ఫిర్యాదు దారుడు సంతృప్తి చెందారా ? లేదా అనే విషయం ఒక రోజు తర్వాత సమాచారం సేకరిస్తామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *