-పరీక్షకు హాజరు కానున్న 12,359 మంది అభ్యర్థులు
-55 మంది విభిన్న ప్రతిభావంతులు
-పరీక్ష నిర్వహణకు 29 కేంద్రాల ఏర్పాటు
-1,160 మంది ఇన్విజిలేటర్ల నియామకం.
-29 మంది వెన్యూ సూపర్‌వైజర్లు
-85 మంది అసిస్టెంట్ సూపర్‌వైజర్లు
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 28వ తేది ఆదివారం యుపిఎస్‌సి ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. యుపిఎస్‌సి ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ పై బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లైజనింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లు, వెన్యూ సూపర్‌వైజర్లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ యుపిఎస్‌సి ప్రిలిమినరీ పరీక్షను ఈనెల 28వ తేది ఆదివారం నిర్వహించడం జరుగుతుందని, ఈ పరీక్షలకు 12,359 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు, పేపర్`1 పరీక్ష, మ.2:30 గంటల నుండి 4:30 గంటల వరకు పేపర్`2 పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి 1,160 మంది ఇన్విజిలేటర్లను నియామించామన్నారు. పటమట కెబిసి జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ లో 55 మంది విభిన్నప్రతిభావంతులు పరీక్షలు రాసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు ఒక రోజు ముందుగా ఈనెల 27వ తేది కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణకు 29 మంది వెన్యూ సూపర్‌వైజర్లు, 85 మంది అసిస్టెంట్ సూపర్‌వైజర్లను నియమించడం జరిగిందన్నారు. నాలుగురు జిల్లా స్థాయి అధికారులు అసిస్టెంట్ కో`ఆర్డినేటింగ్ సూపర్‌వైజర్లుగా నియమించడం జరిగిందన్నారు. సబ్ సెంటర్ సూపర్‌వైజర్లు ఈనెల 25వ తేదిన అసిస్టెంట్ సూపర్‌వైజర్లు, ఇన్విజిలేటర్లతో పరీక్ష కేంద్రాలలో చేసిన ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించుకోవాన్నారు. పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని, వేసవి వడగాల్పులను దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు, అవసరమైన మందులతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలో చేసిన ఏర్పాట్లను ఒక రోజు ముందుగానే పరిశీలించుకోవాలన్నారు. అభ్యర్థుల హాల్ టిక్కెట్లలో నమోదు చేసిన పరీక్ష కేంద్రం పేరు అభ్యర్థి వ్రాసే పరీక్ష కేంద్రం ఒకే విధంగా ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. ఉదయం పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులకు ఆయా పరీక్ష కేంద్రాలలో క్యాంటిన్ ఏర్పాటు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలోను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలని, పరిశరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా ఏపిఎస్ ఆర్‌టిసీ ఆయా రూట్‌లలో బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి, పరీక్షల కస్టోడియన్ అధికారి, కె. మోహన్‌కుమార్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లైజనింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లు, వెన్యూ సూపర్‌వైజర్లు, ఇన్విజిలేటర్లకు పరీక్ష నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధి విధానాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్, సబ్‌కలెక్టర్ అదితి సింగ్, ఆర్‌డివోలు వైవి ప్రసన్నలక్ష్మి, ఆర్ రవీంద్రరావులు ఉన్నారు.
Prajavartha Online Telugu News