Breaking News

నవరత్నాలతో పేదల ఆర్థిక పురోగతి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-91 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాల ద్వారా పేద కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ 91 వ వార్డు సచివాలయ పరిధిలో సోమవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి ఆయన పాల్గొన్నారు. అధికారులు, నాయకులతో కలిసి సీతారాంపురం పరిధి నేతాజీ వీధి, బోయపాటి వారి వీధులలో విస్తృతంగా పర్యటించారు. 165 కుటుంబాలను కలిసి వారికి ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ముఖ్యమంత్రి సంతకం చేసిన ప్రభుత్వ పథకాల బుక్ లెట్లను అందజేశారు. అలాగే స్థానికంగా ఉండే సమస్యలపై ఆరా తీసి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. చెత్తను బహిరంగ ప్రదేశాలలో పడవేయకుండా శానిటరీ సెక్రటరీ, పారిశుద్ధ్య సిబ్బంది చూడాలని ఆదేశించారు. నేతాజీ వీధిలో నూతన రహదారి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ విభాగానికి సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా చరిత్రలో ఓ మైలురాయి
బందరు ప్రజల చిరకాల కల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో సాకారం అయిందని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం పోర్టు నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని.. ఎన్నికలకు 2 నెలల ముందు నిధులు, ఎలాంటి అనుమతులు, నిధులు లేకుండా మొక్కుబడిగా శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు.. రూ.5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పోర్టు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు, ఏప్రిల్‌ 13న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, మార్చిలో 1,923 ఎకరాల భూసేకరణ పూర్తయిన తర్వాత నేడు నిర్మాణ పనులు ప్రారంభించుకున్నట్లు చెప్పారు. ఈ పోర్టు రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించడంతో పాటు.. రానున్న కాలంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ముఖచిత్రం మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రబాబుది బోగస్ మేనిఫెస్టో
ప్రతిప‌క్ష నేత చంద్రబాబు మహానాడు కోసం విడుద‌ల చేస్తున్నది ఒక బోగస్ మేనిఫెస్టో అని మల్లాది విష్ణు విమర్శించారు. 2014 మేనిఫెస్టోను మాయం చేసి.. మరలా అధికారం కోసం 2019 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టిన చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు. కనుకనే ఆ ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. ప్రతిపక్షనేతకు సొంత అజెండా, మేనిఫెస్టో అంటూ లేదని మల్లాది విష్ణు మండిపడ్డారు. సగర్వంగా చెప్పుకునేలా ఏ ఒక్క పథకాన్ని అయిన చంద్రబాబు ప్రవేశపెట్టారా..? అని సూటిగా ప్రశ్నించారు. గ‌త టీడీపీ హ‌యాంలో అంతా దోపిడీయే కొన‌సాగింద‌ని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రతి ఇంటిలోనూ ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు ఉన్నార‌ని చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పేద ప్రజల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా రూ. 2 లక్షల కోట్లను జమచేసిన ఏకైక నాయకులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోనే కరదీపికగా పాలన సాగిస్తున్న సీఎం జ‌గ‌నన్నకు ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, డీఈ(యూజీడీ & వాటర్ సప్లై) రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు కుక్కల రమేష్, కొమ్ము చంటి, ఒబ్బిరెడ్డి రామిరెడ్డి, శంకర్, చింతకాయల రామచంద్రారావు, చిట్టిబాబు, క్రాంతి, మోహన్ రావు, భాను, నాయుడు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *