మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి – సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ (పీఎం-ఎఫ్ఎంఈ), ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రోసెసింగ్ సొసైటీ (ఎపీఎఫ్ పీఎస్) పథకం కింద సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత నిస్తోందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన స్పందన సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్తో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కొనసాగుతున్న అసంఘటిత సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలు పురోగాభివద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ పథకం కింద అర్హులైన లబ్దిదారులకు గరిష్టంగా రూ.కోటి వరకు రుణం, ప్రాజెక్ట్ వ్యయంలో 35 శాతం వరకు రుణ అనుసంధాన రాయితీ (గరిష్టంగా రూ.10 లక్షలు) ఇస్తామన్నారు. ప్రాజెక్ట్ వ్యయంలో పది శాతం బెనిఫిషరీ వాటాను పెట్టుబడి పెట్టగలిగే ఆర్ధిక సామర్ధ్యం కలిగి ఉండాలన్నారు. ప్రస్తుత వ్యాపారంలో కొనసాగుతున్న అన్ని సూక్ష్మ పరిశ్రమల వారు దీనికి అర్హులని పేర్కొన్నారు. ఔత్సాహికులైన యువతీ యువకులు, డ్వాక్రా మహిళలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు స్త్రీలు నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు కమిటీ సభ్యులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎపి ఎఫ్పిఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.మహాలక్ష్మి, డిఆర్డిఎ పీడీ ప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి ఎం. విజయభారతి, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News