Breaking News

రైతు భరోసా కేంద్రాలు రైతులకు భరోసా ఇవ్వాలి !!

-జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
-మందులు, విత్తనాలు సకాలంలో అందించాలి
వ్యవసాయ సలహా మండలి సమీక్షలో కలెక్టర్‌

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు భరోసా కల్పించినప్పుడే రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఆశయం నెరవేరుతుందని జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులకు సూచించారు.
సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ జన్ను రాఘవరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ తో కలిసి వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖ, మత్స్యశాఖ అధికారులతో వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు.
తొలుత గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు తదితర అంశాల గురించి అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ పి. రాజాబాబు మాట్లాడుతూ, రైతులకు ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకూడదన్నారు. ఖరీఫ్‌ 2023 కు సంబంధించి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు పంట రుణాలు అందించడానికి బ్యాంక్‌లు, వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ఖరీఫ్ పంటల సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బంది రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో అనునిత్యం రైతులను కలుస్తూ, వారి ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా పని చేయాలని హితవు పలికారు.
ముఖ్యంగా రైతులు వివిధ పంటలకు సంబంధించి నాణ్యతతో కూడిన విత్తనాలు ఎంపిక చేసుకునేలా చూడాలన్నారు. ఏ రకం పంటకు ఎలాంటి విత్తనాలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయో వివరించాలన్నారు. నకిలీ విత్తనాలతో ఎక్కడ కూడా రైతులు నష్టపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఎరువుల విషయంలో రైతులు అనవసర ఆందోళనకు గురికాకుండా, వారి అవసరాలకు సరిపడా అందుబాటులో ఉన్నాయని వారికి స్పష్టమైన భరోసా కల్పించాలన్నారు. ముఖ్యంగా యూరియా విషయంలో రైతుల్లో ఆదుర్దా నెలకొని ఉంటుందని, అయితే జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా యూరియా ఎరువులను రప్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి వివిధ నియోజకవర్గ సభ్యులు పట్టపు శ్రీనివాసరావు (నాని), సామర్ల రామచంద్రరావు, శ్రీకాకుళపు నాగేశ్వరరావు, తెన్నేరు ప్రభాకరరావు పెరుమాళ్ళు, వేణుబాబు, జిల్లా వ్యవసాయ అధికారి ఎం విజయభారతి, డిడి మనోహర రావు, ఏడి నీలం మణిధర్, లీడ్ బ్యాంకు డైరెక్టర్ సార్ ఎం సాయిరాం, నాబార్డ్ డీడీఎం మిలింద్ చౌసల్కార్, జిల్లా పశుసంవర్ధక అధికారి చంద్రశేఖర రావు, ఏపీఎంఐపి పిడి విజయలక్ష్మి, ఉద్యాన అధికారి జే. జ్యోతి, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సత్యనారాయణ, మార్కెటింగ్ అధికారి నిత్యానందం, ,జలవనరుల అధికారి శ్రీనివాసరావు, విద్యుత్ అధికారి మురళీమోహన్, మార్క్ఫెడ్ డి ఎం మురళీ కిషోర్, ఏపీ సీడ్స్ డిఎం జే అనిత, మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, శాస్త్రవేత్తలు పలువురు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *