-27,031 మంది లబ్దిదారులకు వారం రోజులలో ఇళ్ళ పట్టాలు పంపిణీకి చర్యలు..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఆర్‌డీఏ పరిధిలో అమరావతి ప్రాంతం నందు పేదలకు కేటాయించిన భూములను స్వయంగా లబ్దిదారులకు చూపించి క్షేత్రస్థాయిలోనే ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
సీఆర్‌డీఏ పరిధిలోని అమరావతిలో ఆర్ 5 జోన్ నందు ఇళ్ళ స్థలాలను మంజూరైన లబ్దిదారులకు క్షేత్రస్థాయిలో పట్టాలను అందుకునేందుకు బయలు దేరిన లబ్దిదారుల వాహనాలను సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు నగరంలోని బిఆర్‌టిఎస్ రోడ్డు నుండి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఆర్‌డీఏ ప్రాంతంలో పేద ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోమన్‌రెడ్డి ఇళ్ళ స్థలాలను మంజూరు చేయడం భవిష్యత్‌లో చారిత్రాత్మకమైన సంఘటనగా నిలిచిపోతుందన్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని ఆర్ 5 జోన్ నందు ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన లబ్దిదారులకు సుమారు 737 ఏకరాలలో 14 లేఅవుట్ల ద్వారా 27,031 మంది మహిళల పేరున పట్టాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీరిలో సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన 2,924 మంది లబ్దిదారులను 100 బస్సులలో తుళ్ళూరు మండలం నిడమర్రు గ్రామంలో 86 ప్లాట్లులో కేటాయించిన ఇళ్ళ స్థలాలకు సంబంధించిన భూమిని క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు చూపించి అదే ప్రదేశంలో లబ్దిదారులను జియో ట్యాగింగ్ చేసి పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో పేద మహిళల పేరున లక్షలాది రూపాయల విలువ గల భూములలో ఇళ్ళ పట్టాలను కేటాయించడం సాధారణమైన విషయం కాదన్నారు. పేదలకు మంజూరు చేసిన లేఅవుట్ల వద్దకు వారం రోజులలో లబ్దిదారులను తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలోనే జియో ట్యాగింగ్ చేసి పట్టాలను అందజేసి లబ్దిదారుల నుండి ఆప్షన్ తీసుకుని పట్టాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ ఎన్ని అండకులు ఎదురైనా నిరుపేదలకు రాజధాని ప్రాంతంలో పట్టాల పంపిణీ చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం నేరవేరిందన్నారు. దనిక వర్గాలకు ధీటుగా నిరుపేదల బ్రతుకులు నిలబడాలనదే ప్రభుత్వ ఆశయం అన్నారు. ఒక్కొక్క పేదవానికి సుమారు 7 నుండి 10 లక్షల రూపాయల విలువగల భూమిలో గృహాలు నిర్మించుకునేలా ఇళ్ళ పట్టాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేయవలసి ఉందన్నారు. కేటాయించిన భూముల వద్దకే నేరుగా లబ్దిదారులను తీసుకుని వెళ్ళి వారి సమక్షంలో పారదర్శకంగా పట్టాలను పంపిణీ చేస్తున్నాట్లు ఆయన వివరించారు.
కార్యక్రమంలో నగర మేయర్ రాయనభాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్లు ఆవుతు శ్రీ శైలజారెడ్డి జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, తహాశీల్థార్ సిహెచ్ దుర్గాప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News