-గూడు లేని పేదలందరికీ పక్కా గృహాలు అందించే బృహత్తర కార్యక్రమం గృహ నిర్మాణ శాఖ లక్ష్యం: మంత్రి జోగి రమేష్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గూడు లేని పేదలందరికీ పక్కా ఇళ్ళు అందించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు సంక్షేమ పథకాలు ద్వారా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమలు చేసి ప్రజలకు మెరుగైన జీవితం అందించే దిశలో వారిని ఆదుకుంటున్నారు అని జిల్లా ఇంఛార్జి మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వారు సంయుక్తంగా అధికారులను ఉద్దేశించి అన్నారు.
మంగళవారం మధ్యాహ్నం స్థానిక మహిళా విశ్వవిద్యాలయ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో గృహ నిర్మాణ ప్రగతి పై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఎం.డి. లక్ష్మి షా చిత్తూరు, తిరుపతి జిల్లాల పురోగతిపై సమీక్ష నిర్వహించగా జిల్లా ఇంఛార్జి మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లు మేయర్లు శిరీష, ఆముద తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొనగా తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు కె. వెంకట రమణా రెడ్డి, సగిలి షన్మోహన్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, తిరుపతి ఇంఛార్జి జెసి శ్రీనివాస రావు, చిత్తూరు జెసి శ్రీనివాసులు తదితర జిల్లా అధికారులు హాజరయ్యారు.
జిల్లా ఇంఛార్జి మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్న గొప్ప కార్యక్రమం ఈ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం అని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమం అని ప్రజల ముంగిటకు ప్రజా ప్రతినిధులు, అధికారులు వెళ్లి వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోగలుగుతున్నామని, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను తెలిపే అవకాశం కలిగిందని తెలిపారు. గ్రామ స్థాయి సచివాలయం ద్వారా పరిపాలన ఏర్పాటుతో మంచి సేవలు ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. జగనన్న కాలనీలు కాదు అవి, మహా నగరాలు ఏర్పడుతున్నాయని అన్నారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు వేగవంతం చేయాలనీ అన్నారు. పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి గారు విద్యుత్తు శాఖా మంత్రిగా విద్యుత్ శాఖ ద్వారా ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల కాలం దిగ్విజయంగా పరిపాలన అందించి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని ఆదర్శవంతంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు అని తెలిపారు. అన్ని పథకాలు ఒక ఎత్తైతే గృహ నిర్మాణం ఒక ప్రముఖమైన అతి ముఖ్యమైన పథకం అని, పాదయాత్రలో గూడు లేని పేదవారి బాధలు చూసి వారికి పక్కా ఇళ్ళ నిర్మాణం కొరకు 24 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చి సుమారు 22 లక్షల ఇళ్లు కట్టిస్తున్నారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణాలలో జగనన్న కాలనీలు అవి కాలనీలా కాకుండా ఊర్లు లా ఉన్నాయని అన్నారు. భారత దేశంలో ఏ రాష్ట్రము కానీ, ఏ పార్టీ కానీ గడప గడపకు వెళ్లిన దాఖలాలు లేవని, ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలు ప్రజల ముంగిటకు అందుతున్నందున నేడు ప్రజా ప్రతినిధులు గడప గడపకు ప్రజల ముంగిటకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నారని అన్నారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి వరకు అధికారులు క్షేత్ర స్థాయి వరకు గృహ నిర్మాణ శాఖ అధికారులు పూర్తి నిబద్ధతతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రానున్న జూలై నెలలో దేశంలో ఎక్కడా జరగని విధంగా 5 లక్షల ఇళ్లు సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. భూమి చదును చేసిన బిల్లులు, భూమి కొనుగోలు పెండింగ్ బిల్లులు తదితరాలు త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు చేపడతామని అన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు బాగా పనితీరు చూపిస్తున్నారని అన్నారు. ప్రతి శనివారం హౌసింగ్ డే గా మనం తప్పనిసరిగా తక్కువ పురోగతి ఉన్న ప్రాంతాలను సందర్శించి వారిని మోటివెట్ చేసి ఇళ్ళ నిర్మాణంలో పురోగతి ఉండేలా చూడాలని తెలిపారు.
తిరుపతి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సామూహిక గృహ ప్రవేశాల లక్ష్యం రాష్ట్రంలో 5,10,570 ఇళ్ళ నిర్మాణం కాగా తిరుపతి లక్ష్యం 23,663 గా నిర్దేశించారని వాటిలో ఇప్పటికే 15,512 పూర్తి స్థాయిలో ఇళ్ళ నిర్మాణం జరిగిందని జూలై నాటికి జిల్లా లక్ష్యం చేరుకుంటామని అన్నారు. ఇటుకలు, కంకర కు సంబంధించి యజమానులతో సమావేశం నిర్వహించి రేట్లను నిర్ణయించడం జరిగిందనీ తెలిపారు. వారి ఇబ్బందులను కూడా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని, లబ్దిదారులకు 35 వేలు రుణ సదుపాయం అందించే కార్యక్రమం పొదుపు సంఘాలు, బ్యాంకుల ద్వారా మేప్మా, డిఆర్డిఏ వారీ ద్వారా చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో రోజుకు 150 స్టేజి కన్వర్సన్లు జరిగేలా చర్యలు చేపట్టామని, వీటిని 300 స్టేజి కన్వర్షన్ లు ప్రతి రోజు జరిగేలా ప్రణాళిక బద్ధంగా పని చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు అని లక్ష్యాలను సాధించడానికి అన్ని విధానాల చర్యలు చేపట్టామని తెలిపారు. తిరుపతి జిల్లాలో PMAY గ్రామీన్ కేంద్ర పథకం కింద 5185 మంజూరు కాగా 2000 గ్రౌండింగ్ ఇంకా కావాలి అని మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయని పురోగతికై చర్యలు చేపట్టామని తెలిపారు.
చిత్తూరు కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ నాటికి 29,670 పూర్తి చేశామని అన్నారు. మిగిలినవి సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. పూర్తి చేసిన ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ సకాలంలో ఇవ్వడానికి చర్యలు చేపడుతున్నామని, కుప్పం లో రెస్కో వలన కొంత వెనకబడుతున్నామని అన్నారు.
స్పెషల్ సి ఎస్ అజయ్ జైన్ మాట్లాడుతూ గౌ. ముఖ్యమంత్రి గారు పేదలందరికీ ఇల్లు 21.20 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, హౌసింగ్ కోసమే సుమారు 58,000 కోట్లతో నిర్మాణాలు జరుగుతున్నాయని, కేంద్రం నుండి ఒక కోటి 20 లక్షలు ఇల్లు దేశంలో మంజూరు చేస్తే మనకు 18 శాతం ఇల్లు కేటాయింపు జరిగిందని అన్నారు. కేటగిరీ 3 కింద ఉన్న ఇళ్లకు ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ లు కంట్రాక్టర్లతో అగ్రిమెంట్ ఏర్పాటుతో సంబంధిత లబ్ధిదారులకు ఓపెన్ చేయించాలని, వాలంటీర్లు ఇంజినీరింగ్ అసిస్టెంట్ లు చర్యలు చేపట్టాలని అన్నారు. డబ్బు సమస్య లేదు అని స్టేజి అప్డేషన్ అయిన వాటికి బిల్లులు అందిస్తున్నామని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. వంద పైన ఇల్లు ఉన్న కాలనీలలో వాటికి స్వాగత ఆర్చ్, ఇంకుడు గుంతలు, విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఎంయల్సి భరత్, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్యే చిత్తూరు శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య, రాంకుమార్ మాట్లాడుతూ ఏ ఒక్క పేదవాడు పూరి గుడిసెలో ఉండరాదని వారికి పక్కా ఇల్లు అందించే దిశలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని చేపట్టారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడారు. పలు విషయాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
సమీక్ష అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంత్రులు ప్రజాప్రతినిధులు కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు జిల్లా అధికారులు వివిధ మున్సిపాలిటీల అధికారులు హౌసింగ్ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News