-వేగంగా స్పందించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు..
-స్పందనలో ఇంటి పట్టా అందుకున్న పీతల పార్వతి..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముగ్గురు ఆడపిల్లలతో ఒక మహిళ రైవస్ కాలువ పక్కనే ఉన్న ఫుట్ పాత్ పై దిక్కుతోచని స్థితిలో జీవిస్తోంది. ఎండకు ఎండుతూ… వానకు తడుస్తూ జీవితం గడుపుతున్న ఆమె జీవన గమనం ఒక ప్రముఖ ప్రసారమాధ్యమ సంస్థలో ఫోటోగ్రాఫర్ కంటపడిరది. అతను కూడా ఆమెను రోజూ గమనిస్తూనే ఉన్నాడు. ఎందుకో ఆమె గురించి తెలుసుకోవాలనిపించింది. ఆమె నుంచి ఆ ఫోటోగ్రాఫర్ వివరాలు తెలుసుకున్నాడు ఒకరోజు… ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె పేరు పీతల పార్వతి., భర్త చనిపోయాడు, ఉన్న ఒక్క కూతురు… అల్లుడు కూడా ప్రమాదవ శాత్తు మరణించారు. కూతురుకి ముగ్గురు ఆడపిల్లలు… తల్లి, తండ్రి లేని పిల్లలు. తనది గూడు లేని జీవితం… ఈ పిల్లల్ని ఎలా పెంచాలని క్షణక్షణం ఆవేదన చెందింది. ఈమె కథ ఆ ప్రముఖ దినపత్రికలో ఒకరోజు కథనంగా వచ్చింది. ఆ కథనం చూసిన మానవ హక్కుల సంఘం తక్షణం స్పందించి ఆమెకు సంబంధించిన సమాచారం సేకరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇదంతా జరిగింది 2022 మే నెలలో… మానవ హక్కుల కమీషన్ ఆదేశాలతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇలాంటి నిరుపేదలకు సహాయం చేసే అంశంలో వేగంగా స్పందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. కలెక్టర్ ఎస్. డిల్లీరావు పీతల పార్వతికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అధికార యంత్రాంగం ద్వారా సేకరించారు. ముందుగా కట్టా లావణ్య, కట్టా రాధ, కట్టా భవాని అనే పేరు గల ముగ్గురు మనవరాళ్ళకు ఆధార్ కార్డు అందజేశారు. పెనుమాక సమీపంలోని చిగురు పాఠశాలలో చేర్పించారు. తద్వారా ఆ ముగ్గురు పిల్లలకు అమ్మ ఒడి పథకం ద్వారా ఆర్థిక సాయం అందించారు. వెంటనే దళిత (రెల్లి) కులానికి చెందిన ఆమెకు కుల ధ్రువీకరణ పత్రం కూడా అందించారు. అధికార యంత్రాంగం ఆమె, మనమరాళ్ళ పేర్లతో ఒక రేషన్ కార్డు అందజేసింది. ఆమె పేరుతో ఒక బ్యాంకు ఖాతాను కూడా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం శరవేగంతో సహకరించారు. ప్రభుత్వ సహాయం ఇంతటితో ఆగలేదు. ఈ తరహా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకం లబ్ధిదారునిగా ఆమెను గుర్తించి 18,500 రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అధికార యంత్రాంగాన్ని పార్వతి విషయంలో ఏం చేశారు, ఇంకా ఏం చేయాలి అని అధికార యంత్రాంగాన్ని ఆరా తీశారు. అధికార యంత్రాంగం తాము ఆమెకు అందచేసినవన్నీ చెప్పారు. పేదలందరికి ఇళ్ళు పథకంలో ఆమెకు ఒక స్థలం కూడా ఇచ్చేందుకు కలెక్టర్ ఢల్లీి రావు చొరవ చూపారు. అందులో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో ఆమెకు రాజధాని అమరావతి గ్రామాల్లో ఒకటైన నిడమర్రు లో ఇంటి స్థలం కేటాయిస్తూ ఇంటి పట్టా కూడా అందజేశారు. ఈ సందర్భంగా పార్వతి స్పందిస్తూ మానవ హక్కుల కమీషన్, జిల్లా కలెక్టర్ ఢల్లీి రావు, జిల్లా యంత్రాంగం చొరవతోనే తమకు ప్రభుత్వ సేవలు ఇంత వేగంగా అందాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్, డిఆర్‌ఓ కె. మోహన్ కుమార్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి .ఉమాదేవి, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ అరవ రమేష్, నార్త్ తహసిల్దార్ సిహెచ్ దుర్గాప్రసాద్, విఆర్‌వో లలిత, ఉన్నారు.
Prajavartha Online Telugu News