Breaking News

ఈ నెల 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం

-రాష్ట్రంలో 43 లక్షల మంది విద్యార్థులకు మొదటి రోజునే విద్యాకానుక అందించనున్నాం.
-ఈ నెల 20న రాష్ట్రస్థాయిలో ఆణిముత్యాలు సత్కార కార్యక్రమం
-ఈ నెల 28న అమ్మబడి నగదు తల్లుల ఖాతాల్లో జమ
-పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ విద్యకు అధిక ప్రాధాన్యత
-విద్యార్థుల్లో ఇంగ్లీషు భాషపై పట్టుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
-8వ తరగతి విద్యార్థులకు డిసెంబర్ లో ఉచితంగా ట్యాబ్ ల పంపిణీ.
-ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది.
-టెన్త్, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు వరం మరో ఏడాది రెగ్యూలర్ గా చదివే అవకాశం
– విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని, అదే రోజున విద్యార్థులకు విద్యా కానుకను అందించనున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలలు పున: ప్రారంభ రోజునే విద్యా కానుకలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. 1100 కోట్లు ఖర్చు పెట్టి విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ అందిస్తున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యా కానుకను లాంచనంగా ప్రారంభిస్తారన్నారు. విద్యాకానుక మొదటి రోజునే విద్యార్థులకు అందించాలన్న దృడ సంకల్పంతో అధికారులు చేసిన కృషి ఎనలేనిదన్నారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ 4 దశల్లో క్వాలీటీ చెక్ చేసి మరీ పాఠశాలలకు పంపినట్లు చెప్పారు. ఇప్పటికే దాదాపు 90 శాతంకు పైగా పాఠశాలలకు రవాణా చేశామని చెప్పారు. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఆయా పాఠశాలలకు చేరుస్తామన్నారు. పండగ వాతావారణంలో విద్యార్థులకు విద్యా కానుక అందిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యాకానుకలో భాగంగా అందించే వస్థువుల నమూనా అన్ని మండలాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు.
ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతూ పదవ తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చూపి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానల్లో నిలిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమం ఈ నెల 20న రాష్ట్ర స్థాయిలో మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు పురష్కారం, సర్టిఫికెట్, మెమోంటోలను విద్యార్థులకు అందించనున్నట్లు చెప్పారు. విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులను, ప్రధానోపాధ్యాయులను సత్కరించి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,568 హైస్కూళ్లలో ఆయా పాఠశాలల నిర్వహణ కమిటీ, తల్లితండ్రులు, స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ నెల 12 నుంచి 19 వరకు మెరిట్ విద్యార్థులను సన్మానించటం, ఈ నెల 15న నియోజకవర్గస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమం, ఈ నెల 17న జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను సత్కరిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు వరుసగా రూ. 15వేలు, రూ. 10వేలు, రూ. 5వేలు, మెడల్, సర్టిఫికెట్ అలాగే జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారికి వరుసగా రూ. 50వేలు, రూ. 30వేలు, రూ. 15వేలు తో పాటు మెడల్, సర్టిఫికెట్, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు వరుసగా రూ. లక్ష, రూ. 75వేలు, రూ. 50వేలు అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్ స్థాయిల్లో కలిపి 22,768 మంది విద్యార్థులను సత్కరిస్తున్నట్లు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యర్థుల ఉత్తీర్ణత శాతం పెరిగిందిని, అలాగే వారు వ్యక్తిగతంగా సాధించిన మార్కుల్లో సైతం గణనీయంగా పెరుగుదల ఉందని హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో నాడు – నేడులో భాగంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇప్పటికే మొదటి దశలో 15వేల పాఠశాలల్లో పనులు పూర్తి చేయటం జరిగిందని, రెండవ దశలో మరో 15వేల పాఠశాలల్లో ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, మూడో దశ పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. మొదటి దశలో నాడు-నేడులో ఆధునీకరణ జరిగిన 15వేల పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్క్ కు ఒక స్మార్ట్ టీవీ, హైస్కూల్స్ లో ప్రతి తరగతికి ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ పూర్తి కంటెంట్ లోడ్ చేసి మరీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 5957 ఇంటరాక్టీవ్ ప్లాట్ ప్యానల్స్, 10038 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయటం జరిగిందని వివరించారు. ఈ ఏడాది జూలై నాటికి నూరు శాతం లక్ష్యంను చేరుకుంటామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత వేగంగా డిజిటల్ విద్య దిశగా అడుగులు వేయలేదన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు అందించనున్నట్లు చెప్పారు.
ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడేలా ఇంగ్లీషులో పూర్తి పట్టు సాధించటానికి ప్రాధమిక స్థాయిలో, హై స్కూల్ విద్యార్థులకు డిక్షనరీలను అందించటమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రిన్స్ టన్ యూనివర్శిటీ సహకారంతో తర్ఫీదు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక స్థాయిలోనే టోఫెల్ ప్రైమరీ, ఫైనల్, స్పీకింగ్ టెస్ట్ లు నిర్వహించనున్నట్లు చెప్పారు. దీంతో మన విద్యార్థులు గ్లోబల్ లెవల్ కాంపిటీటివ్ గా మారతారన్నారు. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాకు ఇద్దరు ఉపాధ్యాయులను ప్రిన్స్ టన్ యూనివర్శీటీకి పంపించి శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. పాఠశాలు ప్రారంభమైన రోజు నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోరుముద్ద అమలు జరుగుతుందన్నారు. రోజుకో మెనూతో 15 రకాల వెరైటీలతో పాటు ఫోర్టిఫైడ్ బియ్యం, ఐరన్ లోప నివారణకు వారానికి మూడు రోజులు చిక్కి, మరో మూడు రోజులు రాగిజావ అందిస్తున్నట్లు చెప్పారు.
అమ్మఒడి పథకంలో భాగంగా ఈ నెల 28న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదును జమ చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. ఈ నెల 12 నుంచి ఆయా సచివాలాయాల్లో అమ్మఒడి పథకం అర్హుల లిస్ట్ ను నోటీస్ బోర్టులో ఉంచుతామని అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22లోపు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 80వేల మంది ఉపాధ్యాయలను బదిలీ చేయనున్నమాని తెలిపారు. బదిలీల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు,అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఈ ఏడాది విద్యాకానుకలో విద్యార్థుల యూనిఫాం కుట్టుకూలి రూ. 10లు పెంచి రూ. 45 ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశంగా రెగ్యూలర్ గా మరో ఏడాది చదివే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెగ్యూలర్ విద్యార్థులకు అందించినట్లే వీరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ వర్తిస్తాయని వివరించారు.
పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియం అమలు చేయనున్నామన్నారు. మూడవ తరగతి నుంచే ఇంగ్లీషుకు ప్రత్యేక ఉపాధ్యాయులను ఏర్పాటు చేశామని, ప్రతి విద్యార్థి ఇంగ్లీషును అర్థం చేసుకుని మాట్లాడేలా తర్ఫీదు ఇస్తున్నామన్నారు. ఎడ్యూకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ అనే సంస్థ TOFEL, SAT, GRE పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. ఎడ్యూకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ సంస్థ సహకారంతో వీడియోలు చేసి స్మార్ట్ టీవీల్లో లోడ్ చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచామన్నారు.
కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్య కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు, పాఠశాల విద్యా కమీషనర్ ఎస్. సురేష్ కుమార్, పాఠశాల మౌళిక సదుపాయాల కమీషనర్ కాటంనేని భాస్కర్, సమగ్రశిక్షా అభియాన్ పీడీ శ్రీనివాసరావు, మధ్యాన్న భోజన పథకం సంచాలకులు డాక్టర్ నిధి మీనా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ దివన్ రెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి. దేవానందరెడ్డి, ఏపీఆర్ఐఈఎస్ సెక్రటరీ ఆర్. నరసింహరావు, ఎస్సీఈఆర్టీ డైరక్టర్ డాక్టర్ బి. ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *