తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులకు మరింత మెరుగ్గా పరిష్కారం చూపేందుకు వీలుగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అర్థవంతం గా పరిష్కారం చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో జగనన్నకు చెబుదాం, గడపగడపకు మన ప్రభుత్వం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జగనన్న హౌసింగ్ ప్రోగ్రాం, వ్యవసాయ శాఖ, జగనన్న భూ హక్కు- భూ రక్ష పథకాల పురోగతి పై సమీక్షించారు.
జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, పంచాయితీ రాజ్ కమిషనర్ సూర్యకుమారి, జాయింట్ డి.కె.బాలాజీ , జిల్లా ఎస్.పి. పరమేశ్వర రెడ్డి , అడిషినల్ ఎస్పీ వెంకట్రావు , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరిస్తూ ప్రజల వినతుల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా అందిన అర్జీలకు పూర్తి నాణ్యతతో పరిష్కారం చూపాలని తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా చేపట్టిన పనుల్లో పురోగతి చూపాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి కూలీలకు పని చేసే చోట షెడ్స్, త్రాగునీటి వసతి, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డా. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ల భవనాల నిర్మాణ పనులలో స్టేజ్ అప్ గ్రాడ్యుయేషన్ ఉండాలన్నారు. హౌసింగ్ పథకం కు సంబంధించి ప్రతి శనివారం మండల మరియు మున్సిపాలిటీలలో సంబంధిత అధికారులు వారి పరిధిలో గల రెండు హౌసింగ్ లేఔట్ లను పరిశీలించి గృహ నిర్మాణాల పురోగతికి కృషి చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు నాణ్యతతో కూడిన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి గౌ ముఖ్యమంత్రి సూచించిన విధంగా జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమాలలో భాగంగా అందిన ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జూన్ 23న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష పథకానికి శ్రీకారం చుట్టనున్నారని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు.
ఉపాధి హామీ పథకం క్రింద ఉపాధి కూలీలకు ప్రభుత్వం నిర్ణయించిన వేతనం సగటుకు తగ్గకుండా అందించాలని, వారు పని చేసే చోట వారికి అవసరమైన కనీస వసతులను కల్పించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణ పురోగతిలో స్టేజ్ కన్వర్షన్ కచ్చితంగా ఉండాలని తెలిపారు..
జగనన్న హౌసింగ్ కాలనీలలో నిర్మాణ పురోగతిని అర్బన్ పరిధిలో కేటగిరీ 3 గృహాలు కాంట్రాక్టర్ వేగవంతం చేసేలా చూడాలని అన్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జగనన్న భూహక్కు మరియు భూరక్ష పథకం కింద చేపట్టిన రెండవ దశ పనులను వేగవంతం చేయాలన్నారు. రెండవ దశ పనులను నిర్ణీత సమయంలోపు పూర్తి చేసి జగనన్న భూహక్కు పత్రాలను అందించేలా చూడాలన్నారు.
ఈ సమీక్షలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News