గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ-ఆటోల ద్వారా స్వచ్చ గుంటూరు సాదిద్దామని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు నగరానికి కేటాయించిన 220 ఈ-ఆటోలను బుధవారం నగర మేయర్, ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్, ఆయా వార్డ్ ల వారిగా స్థానిక కార్పొరేటర్లు ప్రారంభించి ప్రజారోగ్య కార్మికులకు అందించారు.
ఈ సందర్భంగా మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు మాట్లాడుతూ స్వచ్చ ఆంధ్రప్రదేశ్ – స్వచ్చ గుంటూరు సాకారానికి ముఖ్యమంత్రి గుంటూరు నగరానికి అధిక సంఖ్యలో ఈ-ఆటోలను కేటాయించారన్నారు. నగరంలోని 206 వార్డ్ సచివాలయాల పరిధిలో ఇక నుండి ఈ-ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ జరుగుతుందని, ఆటోల ద్వారా సేకరణ చేసిన వ్యర్ధాలను నగరంలో 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గార్బేజ్ ట్రాన్సిస్ట్ స్టేషన్ (జిటిఎస్)లకు తరలిస్తారన్నారు. జిటి ఎస్ ల నుండి పొడి, మిక్స్డ్ వ్యర్ధాలను జిందాల్ ప్లాంట్ కు, తడి వ్యర్ధాలను నగరపాలక సంస్థ ప్రాసెసింగ్ సెంటర్లకు తరలిస్తారని పేర్కొన్నారు. ఈ-ఆటోల ద్వారా నగరపాలక సంస్థకు ఆయిల్ వినియోగం తగ్గడంతో పాటు వాతావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు.
యం.యల్.ఏ మాట్లాడుతూ ఈ-ఆటోల ద్వారా కాలుష్య రహితంగా వ్యర్ధాలను సమర్ధవంతమైన విధానంలో ఇంటింటి సేకరణ చేయడానికి వీలు కల్గుతుందన్నారు. నగరంలోని ఒక్కో సచివాలయానికి ఒక ఈ-ఆటో అందుబాటులోకి రావడం వలన మెరుగైన పారిశుధ్య సాధ్యమవుతుందన్నారు. అలాగే ప్రజలు కూడా తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యర్ధాలను రోడ్ల మీద వేయకూడదన్నారు.
కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ల ఇంచార్జ్లు, అధ్యక్షులు, ప్రజారోగ్య అధికారులు, సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News